మార్కెట్ యార్డులకు స్వైప్ మిషన్లు
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌యార్డులలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్వైప్ మిషన్లను అందజేసింది. మార్కెట్‌యార్డుల్లో క్రయ, విక్రయాలకు సంబంధించిన చెల్లింపులు అప్పటికప్పుడే స్వైప్ మిషన్ల ద్వార జరుపుకునేందుకు ఈ పద్ధతిన అవకాశం ఉంటుందని పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య తెలిపారు.
పెద్దపల్లి యార్డుకు కేటాయించిన స్వైప్ మిషన్ ను సోమవారం ఆయన పరిశీలించి అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తన సొంత నియోజకవర్గాన్ని నగదురహిత లావాదేవీలు జరపడంలో ముందుంచినట్టే మార్కెటింగ్శాఖలోనూ ఆ దిశగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
మొదలైన ‘నామ్’ సేవలు
రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్‌యార్డులలో ఆన్ లైన్ పద్ధతిన పంట దిగుబడుల లావాదేవీలు నిర్వహించేందుకు నామ్ సేవలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి మార్కెట్‌యార్డులో సోమవారం తొలిసారిగా క్రయ, విక్రయాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. మార్కెట్ యార్డుకు 51మంది రైతులు సోమవారం తెచ్చిన 218 క్వింటాళ్ల పత్తిని ఆన్ లైన్ పద్ధతిన విక్రయించారు.
ఈ మేరకు రైతులకు ఆన్ లై న్ కొనుగోళ్లపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలయ్య, సూపర్వైజర్ శంకరయ్య తెలిపారు. పెద్దపల్లి మార్కెట్‌యార్డులో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవలు, నగదురహిత లావాదేవీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
218 క్వింటాళ్ల పత్తి కొనుగోలు
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం 218 క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. 51 మంది రైతుల ద్వార యార్డుకు వచ్చిన పత్తికి క్వింటాలు ధర రూ.5460 అత్యధికంగా నమోదు కాగ, కనిష్టంగా రూ.5050 గా నమోదైందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. సరాసరి ధరను రూ.5350గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు.