దుబ్బాకలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలి
దుబ్బాక: చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దుబ్బాక ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని భారత చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ్ల విఠోబా డిమాండ్ చేశారు. గురువారం ఆయన దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులు హోటళ్లలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల వలసలు ఆగాలంటే దుబ్బాక, మిరుదొడ్డి ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలన్నారు.
చేనేత కార్మికులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికునికి పింఛన్ సౌకర్యం కల్పించాలని, ఇటీవల కరిసిన భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. మహాత్మా గాంధీ భీంకర్ యోజన పథకాన్ని ఎందుకు రద్దు చేసిందో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాపెల్లి రాజేశం, వైద్యనాథ్, బొమ్మ కిషన్, శ్రీనివాస్, రవీందర్, అంబదాస్ పాల్గొన్నారు.