ఒక్క చాన్స్ వస్తే చాలు..!
నేనేంటో నిరూపించుకుంటా
ఆసీస్‌తో సిరీస్‌కు స్థానం ఆశిస్తున్నా
‘సాక్షి’తో గుర్కీరత్ సింగ్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సమయంలో మొహాలీలో భారత జట్టుకు సహాయంగా ఉండేందుకు స్థానిక క్రికెటర్ గుర్కీరత్ సింగ్‌ను ఎంపిక చేశారు. అయితే బెంగళూరులో రెండో టెస్టు కోసం అతడికి అనూహ్యంగా పిలుపు దక్కడం అందరినీ ఆశ్చర్యపరచింది. ‘అతనిలోని సామర్థ్యమే ఈ అవకాశం కల్పించింది. ఆరు లేదా ఏడో స్థానాల్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల గుర్కీరత్ త్వరలోనే భారత్‌కు ఆడతాడు చూడండి. జట్టు వ్యూహాల్లో అతను సరిగ్గా సరిపోతాడు’ అని స్వయంగా కెప్టెన్ కోహ్లి ప్రశంసించడం ఆ యువ ఆటగాడికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించింది.
ఫలితంగా మ్యాచ్ అవకాశం దక్కకపోయినా... అతను సిరీస్ చివరి వరకు జట్టుతో కొనసాగాడు. వన్డేల్లోనూ ఇంకా అవకాశం లభించని గుర్కీరత్ ఆ ఒక్క చాన్స్ కోసమే ఎదురు చూస్తున్నానంటున్నాడు. పంజాబ్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు నగరానికి వచ్చిన గుర్కీరత్ తన కెరీర్ గురించి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...
దక్షిణాఫ్రికాతో సిరీస్: ఐపీఎల్లో ఆడితే ఇతరులనుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెబుతారు. కానీ దాంతో పోలిస్తే భారత జట్టు సభ్యుడిగా ఉండే అనుభవమే వేరు. అటు వన్డే సిరీస్‌లోనూ, ఆ తర్వాత టెస్టు సిరీస్‌లోనూ సుదీర్ఘ సమయం పాటు టీమిండియాతో కలిసి ఉండటం నాకు ఎంతో ఉపయోగపడింది. మ్యాచ్ ఆడలేకపోయినా నాకు ఎలాంటి నిరాశ లేదు. డ్రెస్సింగ్ రూంలో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇక ఢిల్లీలో విజయం తర్వాత నిర్విరామ సంబరాల్లో భాగం కావడం ఎప్పటికీ మరచిపోలేను.
తుది జట్టులో స్థానం: ఇక్కడి దాకా వచ్చాను... అక్కడికి వెళ్లలేనా! అందరిలాగే నేను అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నమ్ముతున్నా. ఒక్కసారి మ్యాచ్ అవకాశం వస్తే నన్ను నేను నిరూపించుకుంటా. దేశవాళీలో రెండు సీజన్లుగా నిలకడగా (వరుసగా 449, 677 పరుగులు) రాణిస్తున్నాను. ఐపీఎల్ ద్వారా చాలా మందికి నేను పరిచయమైనా... దానికంటే రంజీ ట్రోఫీ క్రికెట్ వల్లే నాకు గుర్తింపు దక్కుతుందని నమ్మినవాడిని. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను కాబట్టి ప్రదర్శనపై, వైఫల్యంపై ఆందోళన లేదు.
ఇండియా ‘ఎ’ అనుభవం: ముక్కోణపు సిరీస్‌లో, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఉండటంతో నా ఆట ఎంతో మెరుగుపడింది. ముఖ్యం గా షాట్లు ఆడే విషయంలో ద్రవిడ్ పలు సూచనలు ఇచ్చారు. సరైన సమయంలో నేను అక్కడ బాగా రాణించగలిగాను. రంజీల్లో, దేశవాళీ వన్డేల్లో, టి20ల్లోనూ నా రికార్డు బాగుంది. ఫార్మాట్‌కు తగినట్లుగా శైలిని మార్చుకోగలగడమే మంచి ఆటగాడి లక్షణం. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను.
ఓవరాల్ కెరీర్: యువ క్రికెటర్‌గా ఇప్పటివరకు నా ప్రదర్శనపై సంతృప్తిగానే ఉన్నా. మొహాలీ గ్రౌండ్ పక్కనే మా ఇల్లు ఉంది. దాంతో సహజంగానే క్రికెట్‌పై దృష్టి మళ్లింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన నాన్న ప్రోత్సాహంతో వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణించా. మూడేళ్ల క్రితం అండర్-22 ఫైనల్లో ఢిల్లీపై చేసిన 190 పరుగులు నా కెరీర్‌ను మలుపు తిప్పాయి. అయితే మున్ముందు భారత జట్టు తరఫున రెగ్యులర్‌గా ఆడటమే లక్ష్యం. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌తో అది మొదలు అవుతుందని ఆశిస్తున్నా.
ఇతర ఆటగాళ్ల ప్రోత్సాహం: మా అందరికీ హర్భజన్ సింగే స్ఫూర్తి. అతనితో కలిసి ఆడటం గర్వకారణం. నేను ఆఫ్‌స్పిన్నర్‌ను కాబట్టి దాదాపు ప్రతి చిన్న అంశంలో అతని సూచనలు, సలహాలు తీసుకుంటా. అనుమానాలు తీర్చుకుంటా. మైదానం బయట ‘ప్లే స్టేషన్’ను ఇష్టపడే నాకు బైక్‌లంటే పిచ్చి. వన్డే సిరీస్ సమయంలో ధోనితో బైక్‌ల గురించి కొంత మాట్లాడే అవకాశం కూడా దక్కింది!