గుర్ కీరత్ పై కోహ్లి ప్రశంసలు
బెంగళూరు: ఇటీవల కాలంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ల్లో ఆకట్టుకుంటున్న పంజాబ్ ఆల్ రౌండర్ గుర్ కీరత్ సింగ్ మన్ పై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అతనొక ప్రమాదకర ఆటగాడని, ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్ ను లాగేసుకుంటాడంటూ గుర్ కీరత్ ను విరాట్ కొనియాడాడు. శనివారం నుంచి బెంగళూరులో ఆరంభం కానున్న రెండో టెస్టులో గుర్ కీరత్ తుది జట్టులో ఉండవచ్చనే సంకేతాల నేపథ్యంలో విరాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో టీమిండియా జట్టులో గుర్ కీరత్ కీలక సభ్యుడైనా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నాడు.
ఈ సందర్భంగా ముందుగా గుర్ కీరత్ కు శుభాకాంక్షలు తెలిపిన విరాట్.. అతను ఎప్పుడు ఆడతాడనేది కచ్చితంగా చెప్పలేనన్నాడు. టీమిండియా ప్రధాన సమస్యగా మారిన ఆరు, ఏడు స్థానాల్లో ఆడటానికి గుర్ కీరత్ బ్యాటింగ్ శైలి అతికినట్లు సరిపోతుందంటూ విరాట్ అభిప్రాయపడ్డాడు. 'గుర్ కీరత్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. సహజసిద్ధంగా ఆడతాడు. ప్రత్యర్థి జట్ల గెలుపును కూడా అనేక సందర్భాల్లో అడ్డుకున్నాడు. ఈ సీజన్ లో ఇండియా -ఏ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. గుర్ కీరత్ ప్రధానంగా బ్యాట్స మెన్. బౌలింగ్ కూడా ఆకట్టుకుంటాడు. బౌలింగ్ లో ఎక్కువగా కష్టపడతాడు. రాబోవు ఏడాదిన్నర కాలంలో టీమిండియా చాలా టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఈ తరహా క్రికెటర్ల అవసరం జట్టుకు చాలా ఉంది' అని కోహ్లి తెలిపాడు.