
విరాట్ కోహ్లి(Virat Kohli).. రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గత కొంతకాలంగా టెస్టుల్లో తేలిపోతున్నారు. తొలుత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో విఫలమైన ‘విరాహిత్’ ద్వయం.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచారు. గత ఎనిమిది టెస్టు మ్యాచ్‌లలో కలిపి రోహిత్ చేసిన పరుగులు 164.
తీవ్ర స్థాయిలో విమర్శలు
ఇక కోహ్లి విషయానికొస్తే.. గత పది మ్యాచ్‌లలో అతడు 382 పరుగులు చేయగలిగాడు. కివీస్ చేతిలో 3-0తో టెస్టుల్లో వైట్‌వాష్.. ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి.. ఫలితంగా రోహిత్- కోహ్లి ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, తాను ఇప్పట్లో రిటైర్ కానని 37 ఏళ్ల రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు సందర్భంగా కుండబద్దలు కొట్టగా.. 36 ఏళ్ల కోహ్లి అసలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లుగా మిన్నకుండిపోయాడు.
కానీ ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లపై విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి భవితవ్యం ఏమిటన్న అంశం, జట్టులో మార్పులపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది.
చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే
ఇందుకు బదులిస్తూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) మొదలుకావడానికి నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ ఇద్దరు వన్డే క్రికెట్‌లో అత్యద్భుతమైన ప్రదర్శన కలిగి ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే మేము దీనిపై దృష్టి సారిస్తాం. మెగా టోర్నీ పూర్తయిన తర్వాత.. ఆటగాళ్ల ప్రదర్శన, భవితవ్యంపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది.
ఒకరిద్దరు అని కాదు.. ప్రతి ఆటగాడిపై మా దృష్టి ఉంటుంది. ఆ తర్వాతే జట్టులో ఎలాంటి మార్పులు చేయాలో ఆలోచిస్తాం. అయితే, ఇప్పుడు మాత్రం మా ఫోకస్ మొత్తం వన్డే క్రికెట్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించిన సందర్భంగా శనివారం ఈ వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ వేదికగా
కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.
ఇక ఈ ఐసీసీ టోర్నీలో గనుక కోహ్లి- రోహిత్ విఫలమైతే.. వారికి కష్టాలు తప్పకపోవచ్చు. అదే జరిగితే.. తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జట్టులో ఈ దిగ్గజ ద్వయానికి చోటు దక్కడం కష్టమే.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్
అయితే, చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే కోహ్లి- రోహిత్ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గనుక సత్తా చాటితే.. అభిమానులను ఖుషీ చేయడంతో పాటు.. ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.
కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలుకానుంది. అనంతరం ఇరుజట్లు ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పోటీపడతాయి.
చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment