టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు.
ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్‌తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.
కోహ్లి, రాహుల్ దూరం
మరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.
ఢిల్లీ జట్టులో పంత్
రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్‌ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్‌కీపర్), వైభవ్ కంద్‌పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment