గురుపౌర్ణమికి షిర్డీ ముస్తాబు
సాక్షి, ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ ముస్తాబైంది. రకరకాల పూలతో, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ముస్తాబుచేసే అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. షిర్డీలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో గురుపౌర్ణమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సాయిబాబా ఆలయ సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉత్సవాల సమయంలో ఆలయంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
భజన బృందాలు భక్తి పాటలు, కీర్తనలు ఆలపించేందుకు ఆలయం పక్కన 75 వేల చ.ట. భారీ మండపం ఏర్పాటు చేశారు. వర్షాలతో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులందరికి ప్రసాదం సులభంగా లభించాలనే ఉద్దేశంతో 275 క్వింటాళ్ల చక్కెర లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. పల్లకీలతో వచ్చే భక్తులు బస చేసేందుకు సాయి ఆశ్రమం-2 లో ఉచితంగా సౌకర్యం కల్పించి, బస, భోజన ఏర్పాట్లు చేసినట్లు బాబా ఆలయ సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి కుందన్‌కుమార్ సోనవణే తెలిపారు.
రెండు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో వైద్యులు రెండు షిప్టులకీ పనిచేస్తారని సోనవణే అన్నారు. ఈ ఉత్సవాలు పారదర్శకంగా నిర్వహించేందుకు బాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి, సంస్థాన్ పదాధికారి అనీల్ కవాడే, ఇతర పదాధికారులు కృషి చేస్తారని ఆయన అన్నారు.
మూడు రోజులు జరిగే కార్యక్రమాలు : 11న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మాధవ్‌రావ్ ఆజేగావ్కర్గారి కీర్తనలు ఉంటాయి. రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు సుమీత్ బోపాల్ గారి సాయి అమృత్ కథ కార్యక్రమం ఉంటుంది. 12న సాయంత్రం నాలుగు గంటలకు వివిధ భక్తుల కీర్తనలు ఉంటాయి. రాత్రి 7.30 నుంచి వివిధ భక్తి నాటకాల ప్రదర్శన ఉంటుంది. 13న ఉదయం 10.30 గంటలకు ఉట్టి ఉత్సవం, కీర్తనల ఆలాపన, రాత్రి 7.30 గంటలకు సాయి మిలన్ అనే భక్తి కార్యక్రమం ఉంటుందని కుందన్‌కుమార్ అన్నారు. హైదరాబాద్, ముంబై, జబల్పూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు అందజేసిన విరాళాలతో ఈ మూడు రోజుల పాటు షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచిత భోజన వసతి కల్పించినట్లు ఆయన చెప్పారు.