హరి సర్వోత్తమ..వాయు జీవోత్తమ
– ఘనంగా నాల్గో రోజు గురు వైభవోత్సవాలు
– విశేషంగా ఉపనయనం వేడుక
– ఆకట్టుకున్న మూలరాముల సంస్థాన పూజలు
మంత్రాలయం : హరి సర్వోత్తమ..వాయు జీవోత్తమ నామంతో శ్రీమఠం మార్మోగింది. వైభవోత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తి వేడుకలు కనుల పండువగా సాగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో మూలబృందావనంకు పవిత్ర పూజలు గావించారు. పూజామందిరంలో మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో పీఠాధిపతి తరించారు. యాగమండపంలో బ్రాహ్మణ చిన్నారులకు ఉపనయనం నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణలు మధ్య ఎంతో కమనీయంగా ఉపనయం కానిచ్చారు. పీఠాధిపతి ఉపనయన చిన్నారులకు శేషవస్త్రం, పూజా సామగ్రి అందజేసి ఆశీర్వదించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను శ్రీమఠం మాడా వీధుల్లో చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఊరేగించారు. అనంతరం డోలోత్సవ మండపంలో ఊంజల సేవ, దివిటీ సేవ, హారతి సహిత పూజలు చేపట్టారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆం«ద్ర ప్రాంతాల నుంచి భక్తుల వేలాదిగా తరలివచ్చారు. భక్తుల కోలాహలంతో శ్రీమఠం కనువిందు చేసింది. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, దివాన్ వాదీరాజాచార్, డీఎం ఆనందరావు, ప్రిన్సిపాల్ వాదీరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు.