సిక్కుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
గురుద్వారా స్థలంపై ఆధిపత్యం కోసం రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ అమృతసర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాటు తుపాకులతో కాల్పులు జరుపుకోవడంతో ఓ బాలుడు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమృతసర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారా స్థలం మీద ఆధిపత్యం కోసం చాలా కాలంగా రెండు సిక్కు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది. శుక్రవారం నాడు సిక్కులు సంప్రదాయబద్ధంగా జరుపుకొనే ఆయుధాల ప్రదర్శన సమయంలో ఘర్షణ మొదలైంది. తొలుత సంప్రదాయం ప్రకారమే రెండు వర్గాలకు చెందిన పలువురు సిక్కులు ప్రదర్శన ప్రారంభించారు. అంతలోనే గొడవ మొదలైంది.
దాంతో రెండు వర్గాలవారు ఒకరిపై ఒకరు నాటు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. దీంతో ఒక బాలుడు సహా ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో రెండు సిక్కు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతానికి ఉద్రిక్తత సడలింది.