‘గురురాజ’తో నంద్యాలకు జాతీయ గుర్తింపు
నంద్యాల: విద్యారంగంలో గురురాజ బ్యాంక్ కోచింగ్ సెంటర్ నిర్వహణతో నంద్యాల పట్టణానికి జాతీయస్థాయి గుర్తింపు వచ్చిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని బ్యాంక్ కోచింగ్ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నంద్యాలకు నీలం సంజీవరెడ్డి, పీవీ.నరసింహరావుల ద్వారా జాతీయస్థాయి గుర్తింపు లభిస్తే దస్తగిరి రెడ్డిద్వారా గురురాజ కోచింగ్ సెంటరులో శిక్షణ పొందడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు.
పాతికేళ్లలో 13వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక బ్యాంకులో నంద్యాలకు చెందిన ఉద్యోగి పనిచేయడం దస్తగిరి రెడ్డి కఠోర దీక్షకు కారణమన్నారు. తాను హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాలకు తరచూ వెళ్తుంటానని అక్కడ తనను కలిసే వీఐపీలకు గురురాజ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ప్రాధాన్యతను గుర్తుచేస్తుంటానని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి పట్టుపడితే వదలడు అన్న దీక్షతో ముందుకు సాగుతున్నారన్నారు.
బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధినేత దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ప్రారంభించానని బ్యాంక్ కోచింగ్ సెంటరు ఇపుడు అది మహా సముద్రంగా మారిందన్నారు.. ప్రస్తుతం ఏడాది 4 వేల మందికి ఉద్యోగాలు లభించే విధంగా శిక్షణలో ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలిపారు. భూమా, ఏవీ సినీనటుడు తనికెళ్ల భరణితో కలిసి రజతోత్సవ సంచికను విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఎస్పీవెరైడ్డి అనారోగ్య కారణాలతోనే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
లఘుచిత్రం పోస్టర్ విడుదల: రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చైతన్యపరచే లఘుచిత్రంను యోగా వెంకటేశ్వర్లు దర్శకత్వం వహించి రూపొందించారని తనికెళ్ల భరణి తెలిపారు. ఆయనకు సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పదివేల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారిలో రైతు కుటుంబాల నుంచి వచ్చినవారు ఎంతమందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
90శాతం మంది చేతులు ఎత్తారు. అయితే తిరిగి వ్యవ సాయ ఎంతమంది చేస్తారని ప్రశ్నిస్తే 5,6మందికి మించి చేతులు ఎత్తకపోవడంతో సమావేశం విస్మయానికి గురైంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ విజయభాస్కర్‌రెడ్డి, అమృతరాజు, కొండారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, ఏవీఆర్ ప్రసాద్, విద్యాసంస్థల డెరైక్టర్లు మౌలాలిరెడ్డి, షేక్షావలిరెడ్డి పాల్గొన్నారు.