టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి సెగలు
ప్రొద్దుటూరు టౌన్: తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన 11 మంది కౌన్సిలర్లు తీవ్ర నిరాసక్తితో ఉన్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా చైర్మన్‌ను అసమ్మతి కౌన్సిలర్లు ఎవ్వరూ కలవక పోవడం చూస్తుంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఏది మాట్లాడినా రూ.2కోట్లు పెట్టానంటారు...
చైర్మన్, ఆయన బావమరిదిల వ్యవహార శైలిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డిని అసమ్మతి కౌన్సిలర్లు గురువారం కలిశారు. మున్సిపాలిటీలో బావమరిది పెత్తనంపై ఫిర్యాదు కూడా చేశారు. ఏది మాట్లాడినా నేను రూ.2 కోట్లు పెట్టానని మాట్లాడటం ఏమిటని కౌన్సిలర్లు లింగారెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు ఆవుతున్నా ఒక్క పనికి కూడా టెండర్ పిలవలేదని పేర్కొన్నారు. అందరం కలిసి మాట్లాడదామని ఆయన కౌన్సిలర్లకు చెప్పినట్లు సమాచారం.
టీడీసీ కౌన్సిలర్ల జాతకాలు తెలుసులే..
కొద్ది రోజుల కిందట చైర్మన్ కౌన్సిలర్లను పిలిపించిన సమయంలో ఆయనతో మాట్లాడుతుండగా బావమరిది కలుగచేసుకున్నారు. మేము డబ్బు ఖర్చుపెట్టామని బావమరిది చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలో బావమరిది కలుగ చేసుకొని ‘మీ జాతకాలన్నీ మాకు తెలుసు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపోండి’అని మాట్లాడటంతో ఇద్దరు కౌన్సిలర్లు ఆగ్రహించినట్లు సమాచారం. ఆ సమయంలో కూడా చైర్మన్ బావమరిదిని వారించలేకపోవడంతో కౌన్సిలర్లు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.
మాజీ ఎమ్మెల్యే వద్ద అమీతుమీ...
కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బావమరుదుల పెత్తనంపై పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిందేనని ఆయన వద్ద ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆగ్రాలో ఉండటంతో వచ్చేంత వరకు చైర్మన్ వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా అధ్యక్షున్ని, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్లతోనే అసమ్మతి కౌన్సిలర్లు కలిసి వెళ్లారు.
ప్రొద్దుటూరు పరిస్థితులపై వరద ఆరా...
ఆగ్రాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇక్కడి పరిస్థితులపై గురువారం కొందరి కౌన్సిలర్లకు ఫోన్ చేసి ఆరాతీసినట్లు తెలిసింది. దీంతో కౌన్సిలర్లు జరుగుతున్న విషయాలను ఆయనకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా చైర్మన్, బావమరుదులపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే