‘మొండి’ఘటాలపై దూకుడుగా ముందుకు!
సాక్షి, విశాఖపట్నం: 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.350 కోట్లుగా పెట్టుకున్నట్లు మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రకటించింది. ఆ లక్ష్యసాధనకు, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో రెవిన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకూ వివిధ మార్గాల్లో కార్పొరేషన్ ఖజానాకు రూ.226 కోట్లు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చి 31 ఆఖరి రోజు అయినప్పటికీ మార్చి 25 లోపే శతశాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో జీవీఎంసీ రెవిన్యూ అధికారులు సమాయత్తమవుతున్నారు.
100 శాతం వసూళ్లు లక్ష్యం...
ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులన్నీ వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకోసం నూతన విధానాల్ని అవలంబించాలని కమిషనర్ సృజన, డీసీఆర్ ఫణిరామ్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. చెల్లింపుల విషయంలో కొంతమంది మొండి బకాయిదారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో వారిపై అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తున్నారు. కఠిన చర్యల్లో భాగంగా వివిధ పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 12,000 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ నోటీసుల్లో హెచ్చరిస్తున్నారు.
నీటి ఛార్జీలు కట్టకపోతే కుళాయిల కట్
ముందస్తు హెచ్చరికల్లో భాగంగా నిర్ణీత సమయంలో పన్ను చెల్లించని వారికి మంచినీటి నీటి కుళాయి కనెక్షన్లు కట్ చేస్తున్నారు. ముందస్తు నోటీసులు జారీ చేసి.. ఇచ్చిన గడువులోగా ఛార్జీలు చెల్లించాలనీ హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ 3,254 మందికి నోటీసులు జా రీ చెయ్యగా.. 2,501 మంది నీటి పన్ను చెల్లింపులు చేశారు. గ్రేటర్ పరిధిలో 2,11,253 నీటి కనెక్షన్లు ఉండగా.. బకాయిలతో కలిపి మొత్తం 60.68 కోట్లు వసూలు చెయ్యాల్సి ఉంది. మా ర్చి 4వ తేదీ వరకూ రూ.20.08 కోట్లు వసూలైంది. మిగిలిన 40.60 కోట్లని త్వరితగతిన వసూలు చేసేందుకు జీవీఎంసీ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
వార్డు అడ్మిన్లకు బాధ్యతలు
కమిషనర్ ఆదేశాల మేరకు రెవిన్యూ వసూళ్లలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా చర్యలు చేపట్టాలన్నదే లక్ష్యంగా భావిస్తున్నాం. సచివాలయాల్లో నియమితులైన వార్డు అడ్మినిస్ట్రేటర్లకు బా«ధ్యతలు అప్పగించాం. వారికి కొత్త బాధ్యతలు కాబట్టి.. శిక్షణ ఇచ్చాం. ఒక్కో వార్డు అడ్మిన్కి వెయ్యి ఇళ్లు అప్పగించాం. ప్రజలు నిర్దిష్ట కాలంలో పన్నులు చెల్లించి నగరాభివృది్ధకి దోహద పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పన్నులు చెల్లించకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సమీక్షలు
నిర్వహిస్తునాం.
– ఫణిరామ్, జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ)