చంద్రబాబును అనుకరించా
దివంగత తమిళ నటుడు చంద్రబాబు నటనను అనుకరించే ప్రయత్నం చేసినట్లు యువ సంగీత దర్శకుడు, కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ తెలిపారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు. నటి ఆనంది నాయకిగా నటించిన ఈ చిత్రానికి డార్లింగ్ చిత్రం ఫేమ్ శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీనే సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక ఎగ్మోర్‌లో గల రెడిసన్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీ.ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ ఇది వినోదంతో కూడిన యాక్షన్ కథా చిత్రం అన్నారు. అయితే ఇందులో దివంగత నటుడు చంద్రబాబు నటనను అనుకరించే ప్రయత్నం చేశానని జీవీ.ప్రకాశ్‌కుమార్ తెలిపారు. నటి ఆనంది మాట్లాడుతూ త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీతో మళ్లీ ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.
ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటుడు వీటీవీ గణేశ్ మాట్లాడుతూ తాను ఇళయదళపతి విజయ్‌తో నటించిన తెరి చిత్రం 100 కోట్లు వసూలు చేసిందని, ఇప్పుడు జీవీతో నటించిన ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రం 150 కోట్లు వసూలు చేస్తుందని అనడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి.