‘బంగారుతల్లి’కి బాటలేసిన నరహరి
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంటే గుండెలపై కుంపటిలా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న సమాజం.. ఇవన్నీ చూసి చలించి పోయారాయన. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు పేదవర్గాలు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన ఆ అధికారి.. ప్రభుత్వ పరంగా ఆడబిడ్డల పెళ్లికి ఏ విధంగా సాయపడాలనే తపన పడ్డారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి జీవనస్థితిగతులను అధ్యయనం చేసి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకానికి రూపకల్పన చేశారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలులోకి తేగా, మరో పది రాష్ట్రాలు ఆ పథకాన్ని అనుసరించాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకానికి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకమే ప్రేరణ. ఆ అధికారే పరికిపండ్ల నరహరి. 2001 బ్యాచ్‌కు చెందిన సివిల్ సర్వెంట్. రామగుండం మండలం బసంత్‌నగర్‌కు చెందిన నరహరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సిరిసిల్లలో ఆదివారం ‘పద్మ పీఠం ఆత్మీయ సత్కారం’ అందుకుంటున్నారు.
సిరిసిల్ల: బసంత్‌నగర్‌లో టైలర్‌గా పని చేసే పరికిపండ్ల సత్యనారాయణ-సరోజన దంపతుల మూడో సంతానం నరహరి. 1992లో ఐఎంఎస్ఎస్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న నరహరి మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు పొంది కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. హైదరాబాద్ వాసవి కళాశాలలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు.
1998లో అడ్వాన్స్ రీసర్చ్ విభాగంలో సైంటిస్ట్‌గా పని చేస్తూ 1999లో సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినా నిరాశ చెందకుండా ఉద్యో గం చేస్తూనే గంటల తరబడి చదువుతూ సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 2001లో రెండో ప్రయత్నంలో 78 ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002మేలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలిపోస్టింగ్ పొందారు.
2003-04లో గ్వాలియర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా, 2004-05లో ఇండోర్ ఎస్డీవో(రెవెన్యూ), ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌గా 2006లో పనిచేశారు. అనంతరం ఐసీడీఎస్ రాష్ట్ర కమిషనర్ గా 2007 వరకు భోపాల్‌లో విధులు నిర్వహించారు. చింద్వారా జెడ్పీ సీఈవోగా పని చేసిన తర్వాత 2007లో సియోని కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2009-11లో సింగ్రాలి కలెక్టర్‌గా పని చేసిన ఆయన 2011లో గ్వాలియర్ కలెక్టర్‌గా విధుల్లో చేరి కొనసాగుతున్నారు.
లాడ్లీ లక్ష్మీయోజనకు శ్రీకారం..
కలెక్టర్‌గా, ఐసీడీఎస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు పేదలు ఆడపిల్లల పెళ్లికి పడుతున్న కష్టాలను చూసి నరహరి చలించిపోయారు. కూతురు పెళ్లి కోసం ఒక కుటుంబం పడే ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన నరహరి పేదవర్గాలకు ప్రభుత్వ సాయం అందించాలనే లక్ష్యంతో లాడ్లీ లక్ష్మీయోజన పథకానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఆయనే రూపొందించారు.
ఏడాది పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం మరో పది రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ఆడపిల్లల పెళ్లి కోసం ఆసరా ఉండే మంచి పథకాన్ని మన జిల్లా బిడ్డ రూపొందించడం గర్వకారణం. బంగారుతల్లి పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయడం విశేషం.
రాష్ట్రపతి సత్కారం
నరహరి పని చేసేచోట తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ గుర్తింపు సాధించారు. ఐఏఎస్ అధికారిగా ఆఫీసులో కూర్చొని ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పర్యటించి అధికార యంత్రాంగాన్ని కదిలించారు. గ్వాలియర్ కలెక్టర్‌గా వికలాంగులకు చేయూతనిచ్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ మన్ననలు పొందారు. పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతలు గుర్తు చేస్తూ యువతరాన్ని భాగస్వాములను చేస్తూ ‘మిగిలి ఉన్న పని’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నరహరి చేపట్టారు.
ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ డిసెంబర్ 3న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సులో అవార్డు బహూకరించారు. రాష్ట్రపతి ద్వారా సత్కారం పొందిన నరహరి అంతకుముందే వివిధ హోదాల్లో పని చేస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలోనూ నరహరికి అవార్డు లభించడం విశేషం.
రచయితగా..
కలెక్టర్‌గా నిత్యం బిజీగా ఉండే నరహరి పుస్తకాలు చదవడం, క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడడం హాబీలు. లాడ్లీ లక్ష్మీయోజన పథకాన్ని ముప్పై పేజీల డాక్యుమెంటరీ రాసిన ఆయన సాహిత్యకారుడిగా మరో కోణంలో రచనలు చేస్తున్నారు. సమర్థుడి జీవయాత్ర పేరుతో తన ఆత్మకథను ఆవిష్కరిస్తున్నారు. సమర్థ అధికారిగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే కాకుండా రచయితగా నరహరి ముందుకు సాగుతున్నారు. 2002లో శ్రీభగవద్గీతను వివాహమాడిన నరహరికి పాప శ్రీగౌరీఆలయ, బాబు అక్షర్ ఉన్నారు.
ఐదుగురు అన్నదమ్ముల్లో రాము, లక్ష్మణ్, మహేశ్, శ్రీనివాస్ నలుగురు రాష్ట్రంలో వివిధ చోట్ల ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. చెల్లెలు శ్రీదేవి హైదరాబాద్‌లో డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. భార్య శ్రీభగవత్గీత గ్వాలియర్లోనే ప్రొఫెసర్. జిల్లాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి చదువులో రాణిస్తూ అత్యున్నత ఐఏఎస్ సాధించి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం జిల్లాకే గర్వకారణం.
నేడు సిరిసిల్లలో ఆత్మీయ సత్కారం
పద్మపీఠం సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆదివారం నరహరిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. స్థానిక రాజరాజేశ్వర కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో పద్మపీఠం పురస్కారంతో నిర్వాహకులు కొక్కుల భాస్కర్, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఉపసంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ సన్మానిస్తున్నారు. నరహరితో పాటు ప్రముఖ చిత్రకారుడు తెలంగాణ రాజముద్ర సృష్టికర్త ఏలె లక్ష్మణ్, సాహిత్యకారుడు, హైదరాబాద్ స్పెషల్ జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, వస్త్ర పరిశ్రమ విశ్లేషకులు మచ్చ ఆనంద్, మగ్గంపై చిత్రాలు నేసే చేనేతశిల్పి కూరపాటి శ్రీనివాస్, అగ్గిపెట్టెలో చీర, ఉంగరంలో దూరె చీర సృష్టికర్త నల్ల విజయ్‌కుమార్‌లకు ఒకే వేదికపై పురస్కారాలు అందిస్తున్నారు.