మా ఖర్చులెట్లెల్లాలే సారూ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అరమరికలు, దాపరికం లేకుండా మనసులో మాట బయటపెట్టింది మాచారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు గ్యార పెద్ద లక్ష్మి. అమాయకంగా మంత్రి హరీష్‌తో ‘చెరువుల పనులన్నీ గిట్ల టెండర్లతోని ఇస్తే మరి మా ఖర్చులెట్లెల్లాలే, పెట్టుబడులు ఎట్ల సారూ’ అంటూ ఉన్నదున్నట్లుగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.‘మిషన్ కాకతీయ’ లో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పునరుద్ధరణ పనులలో అక్రమాలకు తావులేకుం డా అధికారులు వ్యవహరించాలని, ఈ-టెండర్ల ద్వారానే పనులు అప్పగించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గందన్నారు.
ఈ విషయమై పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తమ పరిధిలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువస్తున్నారు. ఇంతలో మాచారెడ్డి జడ్పీటీసీ లక్ష్మి ‘దళిత మహిళా జడ్పీటీసీ హక్కు లను కాపాడండి’ అని రాసిన ఫ్లకార్డును చేతితో పట్టుకుని లేచి నిలబడింది. ఆమెను చూసి సదస్సులో ఉన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏదో సమస్య గు రించి చెబుతుంది కావచ్చని అనుకున్నారు.
కానీ, ఆమె సమస్య అందరికన్న భిన్నంగా ఉంది. అదేంటంటే ‘‘ప్రస్తుతం మండలాలలో, గ్రామాలలో పనులు లేవు, గీ చెరు వుల పనులేమో టెండర్లంటున్నరు.. గిట్లయితే పెట్టుబడెట్లెల్లాలే సారు’’ అంటూ ప్రశ్నించింది. స్పందించిన మంత్రి హరీష్ ‘‘ ఏం పెట్టుబడి పెట్టావమ్మా.. ఖర్చులు దేనికైనయ్’’ అంటూ అడగగా, ఆమె అమాయకంగా ‘‘జడ్పీటీసీగా పోటీ చేసి చాలా ఖర్చు చేశాం. ఖర్చులు తీయడానికి ఏదైనా మార్గం చూపించండి సారూ’’ అనడంతో మంత్రితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వారు.