రోహిత్ ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సామాజిక కార్యకర్త తీస్తాసతల్వాద్ అన్నారు. సుందర య్య విజ్ఞానకేంద్రంలో రోహిత్ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీస్తాసతల్వాద్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలే హెచ్సీయులో జరుగుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు కారణమని దుయ్యబట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావును పదవినుంచి ఉపసంహరింపజేసే విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలెబట్టుకోవాలని ఆమ్ఆద్మీపార్టీ స్పోక్స్పర్సన్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు డిమాండ్ చేసారు.
గ్రామాల్లోని వెలివాడల కొనసాగింపుగా విశ్వవిద్యాలయాల్లోని వెలుస్తున్న వెలివాడలను నిర్మూలించడానికి బదులు వివక్షను రూపుమాపాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బండారు లక్ష్మయ్య అన్నారు. దళిత, ఆదివాసీలకు చదువుకునే అవకాశం లేకుండా చేసేందుకు, విశ్వవిద్యాలయాలు అగ్రకుల కేంద్రాలుగా తయారుచేసేందుకు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని విద్యాపరిరక్షణ కమి టీ కార్యదర్శి కె.రవిచందర్ అభిప్రాయపడ్డారు. విరసం సభ్యురాలు గీతాంజలి మాట్లాడుతూ తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని, వీసీ అప్పారావుని తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న అమానవీయ ఘటనలను ఈ సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపి వీసీ అప్పారావుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
హెచ్సీయూ ఘటనపై వివరణ ఇవ్వండి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, నమ్రతలు రాష్ట్రమానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే హెచ్ఆర్సీ ఎదుట హాజరుకావాలంటూ సైబరాబాద్ పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలపైవారు స్పందించకపోవడంతో ఏప్రిల్ రెండవ తేదీన కమిషన్ ఎదుట హాజరుకావాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సైబరాబాద్ పోలీసులను తిరిగి ఆదేశించింది. ఏప్రిల్ 2వ తేదీన 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరై ఘటనకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.