మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు.
నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ హ్యాక్ అయితే..
మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే.
బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి.
ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి.
మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి.
హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి.
బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి.
ఫోన్ వేగం మందగిస్తుంటుంది.
తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి.
మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే.
ఏం చెయ్యాలి?
ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి.
ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు.
ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి.
ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి.
ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది.
ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి!
ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు.
అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి.
బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి.
పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు.