నిర్మాణ పనుల్లో భారీ అవకతవకలు
ముంబై: రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఓ ప్రైవేటు సంస్థ రూ. 5000 కోట్ల మేర లబ్ధి పొందిందని, దీనిపై సీబీఐ, సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)లతో సంయుక్త విచారణ జరిపించాలంటూ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) రాష్ట్ర శాసనసభకు సిఫార సు చేసింది. దేశ రాజధాని నగరంలో మహారాష్ర్ట సదన్తోపాటు అంధేరీలోని ఆర్టీఓ కార్యాలయం, హైమౌంట్ అతిథి గృహ నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలు జరిగాయని పీఏసీ ఆరోపించింది.
ఈ నివేదిక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శుక్రవారం దీనిని సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచిందన్నారు. ‘ వివిధ శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపడంతోపాటు వారి వద్దనుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నాం. అంతేకాకుండా ఆయా పనులను తనిఖీ కూడా చేశాం. పనులు జరిగే సమయంలో సదరు కాంట్రాక్టర్ నిబంధనలను సరిగా పాటించలేదని భావిస్తున్నాం. సరైన ఒప్పందం కుదుర్చుకోలేదు. అనేకసార్లు పనులను పొడిగించడంతో ఆ భారం ప్రభుత్వ ఖజానాపై పడింది. ఆర్టీఓ టెస్టింగ్ ట్రాక్, ఆవాస భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యత కూడా అంతంతమాత్రమే. టెండర్లు కూడా పిలవలేదు.
ఈ పనుల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు. కాంట్రాక్టర్కు రూ. 5,000 కోట్లకంటే ఎక్కువ లబ్ధి కలిగింది. అన్ని అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలి. ఆరు నెలల్లోగా తప్పనిసరిగా నివేదికను సమర్పించాలి. ఇది అంతర్రాష్ర్ట ప్రాజెక్టు అయినందువల్ల దీనిపై సిట్ దర్యాప్తు ముగిసిన తర్వాత ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోరారు. మహారాష్ట్ర సదన్ నిర్మాణ పనులు జరిగిన తీరు ఏమాత్రం మాకు నచ్చలేదు. ప్రభుత్వం నియమించిన కన్సల్టెంట్స్, ఆర్కిటెక్టులు బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు అందులో సరైన వసతులు కూడా లేవు. అయితే ఉన్నతాధికారులకు మాత్రమే భారీస్థాయిలో వసతులు కల్పించారు’ అని ఆరోపించారు.