సెప్టెంబర్ 14న తొలి హజ్ ఫ్లైట్
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర తొలి ఫ్లైట్ సెప్టెంబర్ 14న ఉదయం 11.30 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఏ. షుకూర్ వెల్లడించారు. ఈ ఫ్లైట్ ద్వారా 350 మంది యాత్రికులను జెడ్డాకు పంపిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 6050 మందిని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 12 నుంచి నాంపల్లిలోని హజ్ హౌజ్లో యాత్రికులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.