Hakimpeta
-
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఢిల్లీ కేంద్రంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ బుషన్ ఘటన మరువకముందే మరో బ్రిజ్ బుషన్ ఆగడాల వెలుగులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. అయితే అధికారులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదని.. లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. @raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 -
మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..!
CRPF Assistant Commandant: విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు ఇంధన సంస్థలు... ఇలా ఏ సున్నిత ప్రాంతమైనా అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పహారాలో ఉంటుంది. ఈ దళంలో పని చేయడానికి ఎంపికైన వారికి హైదరాబాద్ శివార్లలో ఉన్న హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (నిసా) ట్రైనింగ్ ఇస్తారు. ఈసారి శిక్షణ పొందిన 62 మందిలో స్నేహ ప్రదీప్ పాటిల్, భూమిక వార్షినే, కీర్తి యాదవ్ అనే ముగ్గురు మహిళలున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి... మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన స్నేహ ప్రదీప్ పాటిల్ తండ్రి రైతు. తల్లి గృహిణి. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన స్నేహ... యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు. ఆమెతో పాటు శిక్షణపొందిన అనేక మంది సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టారు. ఆ స్ఫూర్తితో ఆమె సీఐఎస్ఎఫ్ను ఎంచుకున్నారు. ‘శిక్షణలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరు అంశాలు ఉండవు. ఈ నేపథ్యంలో మహిళలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సివిల్స్ రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగా దేశ సేవ చేయాలన్నది నా లక్ష్యం. అది సాధ్యం కాకుంటే సీఐఎస్ఎఫ్ ద్వారా సేవ చేస్తా’ అన్నారు స్నేహ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! తండ్రిని చూసి స్ఫూర్తి పొంది... హర్యానా, రివాడీ జిల్లాకు చెందిన కీర్తి యాదవ్ తండ్రి ప్రతాప్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. ప్రస్తుతం వారెంట్ ఆఫీసర్. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ (ఆనర్స్) చేశారామె. ఢిల్లీలో ఉండి సివిల్స్‌కు తర్ఫీదు పొందుతుండగా... సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్) ద్వారా నిసాలో అడుగుపెట్టారు. ‘నిసాలో శిక్షణ అనేక కొత్త విషయాలను నేర్పింది. సెప్టెంబర్‌లో జరిగిన వారం రోజుల గ్రేహౌండ్స్ శిక్షణలో జంగిల్ క్యాంప్ జరిగింది. ఆ సమయంలో తీవ్ర వర్షాలు కురుస్తుండటంతో టాస్క్ కష్టసాధ్యమైంది. నా టార్గెట్ సివిల్స్’ అని కీర్తి తెలిపారు. ఎన్సీసీలో సక్సెస్ కావడంతో... ఉత్తరప్రదేశ్, బదాయు ప్రాంతానికి చెందిన భూమిక వార్షినే అలహాబాద్ యూనివర్శిటీ నుంచి బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన భూమిక కళాశాల రోజుల నుంచి ఎన్సీసీలో కీలకంగా వ్యవహరించే వారు. ఈమె చూపిన ప్రతిభ ఫలితంగా యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో శ్రీలంక వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే రక్షణ బలగాల్లో చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు. ‘నిసాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. వార్షిక క్రీడా పోటీల్లో ఉత్తమ అథ్లెట్‌గా పీవీ సింధు చేతుల మీదుగా సత్కారం అందింది. శిక్షణలో చూపిన ప్రతిభతో పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్లటూన్ కమాండర్ అయ్యా. మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారాలని, నన్ను చూసి మరింత మంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టాలన్నదే నా లక్ష్యం’ అని భూమిక వివరించారు. ముగ్గురివీ అత్యత్తమ ర్యాంకులే... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (యూపీఎస్సీ) నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్ష ద్వారా అసిస్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) శిక్షణకు ఎంపికయ్యారు ఈ ముగ్గురూ. గతేడాది జరిగిన ఈ పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనేక వడపోతల తర్వాత 62 మంది నిసా వరకు వచ్చారు. ఈ పరీక్ష ఆలిండియా ర్యాంకుల్లో భూమికకు తొమ్మిది, కీర్తికి 26, స్నేహకు 52వ ర్యాంక్ లు వచ్చాయి. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ చదవండి: మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా.. -
100 ఎకరాలు లాక్కున్నారు: ఈటలపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో తమ అసైన్డ్ భూములను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు కబ్జా చేశారంటూ.. కొందరు రైతులు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 1994లో బడుగు బలహీన వర్గాలకు సాయం కింద ప్రభుత్వం సర్వే నంబర్లు 130/5, 130/9, 130/10లలో.. చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి పరశురాం, చాకలి నాగులు అనే వ్యక్తులకు ఒకటిన్నర ఎకరాల చొప్పున అసైన్ చేసిందని లేఖలో వివరించారు. సర్వే నంబర్ 130/2లో ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు అనే వ్యక్తుల పేరిట మూడెకరాలు అసైన్ చేసినట్టు తెలిపారు. తమకు చెందిన ఈ భూములను మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు సూరి అలియాస్ సుదర్శన్, యంజాల సుధాకర్‌రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని భయపెట్టారని.. తమతోపాటు వంద మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి అసైన్డ్ సర్టిఫికెట్లను దౌర్జన్యంగా లాక్కున్నారని పేర్కొన్నారు. వంద ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి ఈటల, ఆయన అనుచరులు రెండు గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రైతులు ఆరోపించారు. ఆ భూముల్లో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వారికి అడ్డుపడుతున్న రైతులను బెదిరిస్తున్నారని, తమ పొలాలకు వెళ్లే దారి మూసేసి ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. భూములను తమకు అమ్మేయాలని, లేకుంటే శాశ్వతంగా దారిలేకుండా చూస్తామని బెదిరిస్తున్నారని లేఖలో రైతులు పేర్కొన్నారు. మాపై మంత్రి ఈటల ఒత్తిడి చేశారు అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూములకు సంబంధించి గతంలో మంత్రి తమపై ఒత్తిడి తెచ్చారని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. అక్కడ ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఈటలకు సంబంధించినదే అయిఉంటుందన్నారు. గతంలో బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తమకు కేటాయిస్తే పౌల్ట్రీ హేచరీకి ఉపయోగపడుతాయంటూ.. మంత్రి అనుచరులు తన వద్దకు వచ్చారని, గతంలో మెదక్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన నగేశ్ చెప్పారు. ఎంత ఒత్తిడి వచ్చినా.. అసైనీలకు తప్ప వేరొకరికి భూములు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పామన్నారు. భూములపై అసైనీలు తమకు ఫిర్యాదు చేశారని.. పొజిషన్లోకి వెళ్లి, భూములను వినియోగించుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు. మా పొలానికి వెళ్లనీయడం లేదు గ్రామశివారులో మా పేరిట మూడెకరాల సీలింగ్ భూమి ఉంది. సాగుకోసం గతంలోనే చదును చేసుకున్నాం. కొన్నేళ్ల కింద ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిన మంత్రి ఈటల కుటుంబీకులు.. మమ్మల్ని మా భూమిలోకి వెళ్లనీయడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే భూమిని ఎంతో కొంతకు అమ్ముకొని వెళ్లండి. కానీ దారి ఇవ్వం అంటూ బెదిరిస్తున్నారు. – టంటం లక్ష్మి, అచ్చంపేట సర్పంచ్ సొసైటీకి కేటాయించిన భూమిని లాక్కున్నారు గీత కార్మికులు ఈత వనాలు పెంచుకునేందుకు 2003లో ప్రభుత్వం ఐదెకరాలు కేటాయించింది. మాకు కేటాయించిన స్థలాన్ని చదును చేసి మొక్కలు పెట్టేందుకు ప్రయత్నించగా మంత్రి ఈటల వర్గీయులు అడ్డుపడి బలవంతంగా లాక్కున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికారులు మరోచోట బండరాళ్లున్న భూమిని చూపెట్టారు. అక్కడ చదును చేయడానికి వెళ్తే మైనింగ్ అధికారులు అడ్డుకున్నారు. – అంజాగౌడ్, గీత కార్మికుడు, అచ్చంపేట మా భూమి నుంచి రోడ్డు వేసుకున్నారు సర్వే నంబర్ 77లో మాకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. మాకు సమాచారం ఇవ్వకుండానే మా భూముల నుంచి అక్రమంగా 50 ఫీట్ల మట్టిరోడ్డు వేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా బలవంతంగా పనులు చేపట్టారు. ఇదేమిటని పరిశ్రమ సిబ్బందిని నిలదీస్తే, పట్టించుకోవడం లేదు. – శ్రీను, అచ్చంపేట ఎంక్వైరీ చేస్తాం మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి గ్రామాలకు చెందిన భూముల వ్యవహారం ఈరోజే తెలిసింది. విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. – హరీశ్, కలెక్టర్, మెదక్ జిల్లా -
గడువులోగా ఏర్పాట్లు చేయండి
రాష్ట్రపతి విడిదిపై అధికారులకు అధర్‌సిన్హా ఆదేశం సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భాగ్యనగరానికి రానున్న నేపథ్యంలో గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా వివిధ శాఖల అధి కారులను ఆదేశించారు. రాష్ట్రపతి ఈ నెల 22 నుండి 31 వరకు హైదరాబాద్‌లో విడిది చేయనున్న సందర్భంగా మంగళవారం సచివాలయం లో అధర్‌సిన్హా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అవసరమైన సిబ్బంది, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో రోడ్లకు మర మ్మత్తులు, స్వాగత తోరణాలు, అవసరమైన హెలీపాడ్ ఏర్పాట్లు, బారీకేడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని అధర్‌సిన్హా ఆదేశించారు. హకీంపేట ఎయిర్‌పోర్టులోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలో అవసరమైన మరమ్మతులు, మంచినీటి సరఫరా, విద్యుద్దీకరణ, పుష్పాలంకరణ, టెలిఫోన్ సౌకర్యం, కంప్యూటర్, ప్రింటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాల న్నారు. డిసెంబర్ 23న ఉదయం 11 గంట లకు ఆర్మీ డెంటల్ కాలేజీలో ఎండీఎస్ ఆరో, బీడీఎస్ పదకొండో స్నాతకోత్సవం లోనూ మధ్యాహ్నం 12.30 గంటలకు హైటెక్స్‌లో జరిగే ఫ్యాప్సీ సెంటెనరీ ఉత్సవాల్లో, డిసెంబర్ 26న మధ్యాహ్నం 12 గంటలకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో జరిగే ఆరో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాత గుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్, ప్రోటోకాల్ డిప్యూటీ సెక్రటరీ అర్వీందర్ సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళా కండక్టర్ల కరాటే
సాక్షి, సిటీబ్యూరో: హకింపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో మహిళా కండక్టర్లకు స్వీయ రక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలను పెంచుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు అకాడమీ, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జీఆర్ కిరణ్‌రెడ్డి శనివారం శిక్షణ తీరును పరిశీలించారు. మహిళా కండక్టర్లకు వివిధ అంశాలను వివరించారు.