
గడువులోగా ఏర్పాట్లు చేయండి
రాష్ట్రపతి విడిదిపై అధికారులకు అధర్‌సిన్హా ఆదేశం
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భాగ్యనగరానికి రానున్న నేపథ్యంలో గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా వివిధ శాఖల అధి కారులను ఆదేశించారు. రాష్ట్రపతి ఈ నెల 22 నుండి 31 వరకు హైదరాబాద్‌లో విడిది చేయనున్న సందర్భంగా మంగళవారం సచివాలయం లో అధర్‌సిన్హా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అవసరమైన సిబ్బంది, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో రోడ్లకు మర మ్మత్తులు, స్వాగత తోరణాలు, అవసరమైన హెలీపాడ్ ఏర్పాట్లు, బారీకేడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని అధర్‌సిన్హా ఆదేశించారు.
హకీంపేట ఎయిర్‌పోర్టులోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలో అవసరమైన మరమ్మతులు, మంచినీటి సరఫరా, విద్యుద్దీకరణ, పుష్పాలంకరణ, టెలిఫోన్ సౌకర్యం, కంప్యూటర్, ప్రింటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాల న్నారు. డిసెంబర్ 23న ఉదయం 11 గంట లకు ఆర్మీ డెంటల్ కాలేజీలో ఎండీఎస్ ఆరో, బీడీఎస్ పదకొండో స్నాతకోత్సవం లోనూ మధ్యాహ్నం 12.30 గంటలకు హైటెక్స్‌లో జరిగే ఫ్యాప్సీ సెంటెనరీ ఉత్సవాల్లో, డిసెంబర్ 26న మధ్యాహ్నం 12 గంటలకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో జరిగే ఆరో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాత గుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్, ప్రోటోకాల్ డిప్యూటీ సెక్రటరీ అర్వీందర్ సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.