పంచాయతీ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో తమ అసైన్డ్ భూములను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు కబ్జా చేశారంటూ.. కొందరు రైతులు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 1994లో బడుగు బలహీన వర్గాలకు సాయం కింద ప్రభుత్వం సర్వే నంబర్లు 130/5, 130/9, 130/10లలో.. చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి పరశురాం, చాకలి నాగులు అనే వ్యక్తులకు ఒకటిన్నర ఎకరాల చొప్పున అసైన్ చేసిందని లేఖలో వివరించారు. సర్వే నంబర్ 130/2లో ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు అనే వ్యక్తుల పేరిట మూడెకరాలు అసైన్ చేసినట్టు తెలిపారు.
తమకు చెందిన ఈ భూములను మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు సూరి అలియాస్ సుదర్శన్, యంజాల సుధాకర్‌రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని భయపెట్టారని.. తమతోపాటు వంద మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి అసైన్డ్ సర్టిఫికెట్లను దౌర్జన్యంగా లాక్కున్నారని పేర్కొన్నారు.
వంద ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి ఈటల, ఆయన అనుచరులు రెండు గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రైతులు ఆరోపించారు. ఆ భూముల్లో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వారికి అడ్డుపడుతున్న రైతులను బెదిరిస్తున్నారని, తమ పొలాలకు వెళ్లే దారి మూసేసి ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. భూములను తమకు అమ్మేయాలని, లేకుంటే శాశ్వతంగా దారిలేకుండా చూస్తామని బెదిరిస్తున్నారని లేఖలో రైతులు పేర్కొన్నారు.
మాపై మంత్రి ఈటల ఒత్తిడి చేశారు
అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూములకు సంబంధించి గతంలో మంత్రి తమపై ఒత్తిడి తెచ్చారని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. అక్కడ ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఈటలకు సంబంధించినదే అయిఉంటుందన్నారు. గతంలో బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తమకు కేటాయిస్తే పౌల్ట్రీ హేచరీకి ఉపయోగపడుతాయంటూ.. మంత్రి అనుచరులు తన వద్దకు వచ్చారని, గతంలో మెదక్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన నగేశ్ చెప్పారు. ఎంత ఒత్తిడి వచ్చినా.. అసైనీలకు తప్ప వేరొకరికి భూములు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పామన్నారు. భూములపై అసైనీలు తమకు ఫిర్యాదు చేశారని.. పొజిషన్‌లోకి వెళ్లి, భూములను వినియోగించుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు.
మా పొలానికి వెళ్లనీయడం లేదు
గ్రామశివారులో మా పేరిట మూడెకరాల సీలింగ్ భూమి ఉంది. సాగుకోసం గతంలోనే చదును చేసుకున్నాం. కొన్నేళ్ల కింద ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిన మంత్రి ఈటల కుటుంబీకులు.. మమ్మల్ని మా భూమిలోకి వెళ్లనీయడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే భూమిని ఎంతో కొంతకు అమ్ముకొని వెళ్లండి. కానీ దారి ఇవ్వం అంటూ బెదిరిస్తున్నారు.
– టంటం లక్ష్మి, అచ్చంపేట సర్పంచ్
సొసైటీకి కేటాయించిన భూమిని లాక్కున్నారు
గీత కార్మికులు ఈత వనాలు పెంచుకునేందుకు 2003లో ప్రభుత్వం ఐదెకరాలు కేటాయించింది. మాకు కేటాయించిన స్థలాన్ని చదును చేసి మొక్కలు పెట్టేందుకు ప్రయత్నించగా మంత్రి ఈటల వర్గీయులు అడ్డుపడి బలవంతంగా లాక్కున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికారులు మరోచోట బండరాళ్లున్న భూమిని చూపెట్టారు. అక్కడ చదును చేయడానికి వెళ్తే మైనింగ్ అధికారులు అడ్డుకున్నారు.
– అంజాగౌడ్, గీత కార్మికుడు, అచ్చంపేట
మా భూమి నుంచి రోడ్డు వేసుకున్నారు
సర్వే నంబర్ 77లో మాకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. మాకు సమాచారం ఇవ్వకుండానే మా భూముల నుంచి అక్రమంగా 50 ఫీట్ల మట్టిరోడ్డు వేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా బలవంతంగా పనులు చేపట్టారు. ఇదేమిటని పరిశ్రమ సిబ్బందిని నిలదీస్తే, పట్టించుకోవడం లేదు.
– శ్రీను, అచ్చంపేట
ఎంక్వైరీ చేస్తాం
మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి గ్రామాలకు చెందిన భూముల వ్యవహారం ఈరోజే తెలిసింది. విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. – హరీశ్, కలెక్టర్, మెదక్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment