ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో సిసీ ఘన విజయం
కైరో: ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే మాజీ సైన్యాధిపతి అబ్దుల్ అల్ సిసీ(59) తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయనకు 96 శాతం ఓట్లు(2.39 కోట్ల ఓట్లు) దక్కాయి. ఆయన ప్రత్యర్థి హమ్దీన్ సబ్బాహీకి 4 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ ఎన్నికల ప్రాథమిక ఫలితాలను గురువారం ప్రకటించారు.
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పోలింగ్‌ను ఒక రోజు పొడిగించినా అది 47 శాతానికే పరిమితమైంది. సిసీ అఖండ విజయంతో ప్రజలు భిన్న రాజకీయ వర్గాలు విడిపోయిన ఈజిప్టుపై సైనిక పట్టు మరింత బిగిసింది. సీసీ గెలుపుతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకోగా, ఎన్నికలను బహిష్కరించిన ముస్లిం బ్రదర్హుడ్ ఎన్నికల ప్రక్రియ మొత్తం నాటకమని విమర్శించింది. తన ప్రణాళిక సజావుగా అమలైతే రెండేళ్లలో దేశాన్ని ప్రగతి పథం పట్టిస్తానని, తనపై నిరసనలు వెల్లువెత్తితే పదవి నుంచి తప్పుకుంటానని సిసీ అన్నారు.