hand fracture
-
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్
లంకతో టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లు దూరమవ్వగా.. దీపక్ చహర్ కూడా తొడ కండరాల గాయంతో లంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా టీమిండియాకు మరో షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది. లంకతో సిరీస్‌కు సిద్ధమైన సూర్య మంగళవారం లక్నోలో ప్రాక్టీస్ సెషన్లో కనిపించినప్పటికి కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. చేతికి ప్రాక్చర్ అయినట్లు తేలడంతో లంకతో టి20 సిరీస్‌కు అతన్ని దూరంగా ఉంచనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.కాగా దెబ్బ ఎక్కడ తగిలిందనే విషయంపై స్పష్టత రాలేదు. బహుశా విండీస్‌తో మూడో టి20లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనే సూర్యకుమార్ చేతికి గాయమై ఉంటుంది. అయితే చేతికి బ్యాండేజీ వేసుకోకపోవడంతో గాయం తీవ్రత పెద్దగా కనిపించలేదు. కాగా రెస్ట్ పేరుతో కోహ్లి, రిషబ్ పంత్‌లు టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సూర్యకుమార్ యాదవ్ విండీస్‌తో టి20 సిరీస్‌లో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మూడో టి20లో 31 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కాగా మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. చదవండి: IND Vs SL: గాయంతో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం -
చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు
బంజారాహిల్స్/ లింగాలఘణపురం: చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్తే అక్షరాల రూ.25లక్షల బిల్లు వేశారు.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు కొంత అప్పు చేసి సుమారు రూ.9లక్షల వరకు చెల్లించారు. అయినా చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32)కు ఈనెల 7వ తేదీన లింగాలఘన్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స నిమిత్తం బంధుమిత్రులంతా తలా కొంత పోగు చేసుకొని రూ.9లక్షల దాకా చెల్లించారు. ఈక్రమంలో అక్కడ అందుతోన్న చికిత్సతో కోలుకుంటున్నాడని అందరూ భావించారు. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అడిగినంత డబ్బు చెల్లిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం నాగరాజు మృతి చెందాండంటూ ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. రెండు రోజుల క్రితం కూడా తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడంటూ బంధుమిత్రులు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేయి విరిగిందని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 లక్షల బిల్లు వేశారని ఇప్పటికే రూ.9 లక్షలు చెల్లించామని ఇంకో రూ.15 లక్షలు చెల్లించి బాడీ తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి. మూడు గంటల పాటు గ్రామస్తులంతా ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో బకాయి బిల్లు లేకుండానే మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రానికి మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వర్గాలు బాధితకుటుంబానికి రూ.2 లక్షలు అందజేసినట్లు సమాచారం. చదవండి: చెరువులో విషప్రయోగం.. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
ఏఎస్ఐ చేయి నరికేశారు!
చండీగఢ్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ముఠా ఇదేమని ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి చేయి తెగిపోగా మరో ముగ్గురు పోలీసులు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కొందరు నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. పోలీసులు వారిని పాస్‌లు చూపించాలని కోరగా బారికేడ్లపైకి వాహనాన్ని నడిపారు. అడ్డుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) హర్జీత్ సింగ్ చేతిని తమ వద్ద ఉన్న కత్తితో నరికారు. మార్కెట్ అధికారితోపాటు మరో ముగ్గురు పోలీసులను కూడా గాయపర్చారు. పోలీసులు వెంబడించగా దుండగులు అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని బల్బేర్ గ్రామంలోని గురుద్వారాలో దాక్కున్నారు. ఈలోగా గాయపడిన హర్జీత్ సింగ్‌ను, తెగిన చేయి సహా అధికారులు చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)కు తరలించారు. నిహంగ్‌ల ముఠా గురుద్వారాలో దాగిన విషయం తెలిసిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. లోపలున్న మహిళలు, చిన్నారులకు హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగిపోవాలని హెచ్చరించినా దుండగులు వినకుండా గ్యాస్ సిలిండర్లతో గురుద్వారాను పేల్చి వేస్తామని బెదిరించడంతోపాటు పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకా>ల్పుల్లో ఆ ముఠాలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన ముఠాలోని ఐదుగురు, ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, కత్తులు, మత్తు కోసం వాడే గసగసాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పీజీఐఎంఈఆర్లోని వైద్య బృందం ఏఎస్సై హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. హర్జీత్ సింగ్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
కత్రినా చెయ్యి విరిగిందా?
మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన హీరోయిన్.. కత్రినా కైఫ్. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో తారాపథానికి దూసుకెళ్లిన కత్రినా, మళ్లీ సౌత్ వైపు చూడలేదు. తాజాగా కత్రినా తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫొటో చూసి అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒక పాత కారు ముందు కూర్చుని, తన ఎడమ చేతికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు కట్టుకుని ఆ ఫొటోలో కత్రినా ఉంది. దాంతో ఆమె చెయ్యి ఏమైనా విరిగిందా, అందుకే ఇలా బ్యాండేజి వేయించుకుందా అని అనుకున్నారు. అయితే, ఈ ఫొటోలో ఉన్నది నిజమైన బ్యాండేజి కాదట. తాజాగా ఆమె నటిస్తున్న జగ్గా జాసూస్ సినిమా కోసం ఆమె ఈ నకిలీ కట్టు కట్టుకున్నారని తెలిసింది. సూర్యాస్తమయం సమయం వచ్చినప్పుడు ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే వదిలిపెట్టాలని, ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కత్రినా చాలా కాలం తర్వాత తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. గత కొంత కాలంగా జగ్గా జాసూస్ సినిమాకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమాతో పాటు 'ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న టైగర్ జిందగీ హై అనే మరో సినిమాలోనూ చేస్తోంది. అందులో మరో మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి చేస్తోంది.