ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబసభ్యులు
బంజారాహిల్స్/ లింగాలఘణపురం: చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్తే అక్షరాల రూ.25లక్షల బిల్లు వేశారు.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు కొంత అప్పు చేసి సుమారు రూ.9లక్షల వరకు చెల్లించారు. అయినా చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32)కు ఈనెల 7వ తేదీన లింగాలఘన్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
చికిత్స నిమిత్తం బంధుమిత్రులంతా తలా కొంత పోగు చేసుకొని రూ.9లక్షల దాకా చెల్లించారు. ఈక్రమంలో అక్కడ అందుతోన్న చికిత్సతో కోలుకుంటున్నాడని అందరూ భావించారు. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అడిగినంత డబ్బు చెల్లిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం నాగరాజు మృతి చెందాండంటూ ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. రెండు రోజుల క్రితం కూడా తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడంటూ బంధుమిత్రులు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
చేయి విరిగిందని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 లక్షల బిల్లు వేశారని ఇప్పటికే రూ.9 లక్షలు చెల్లించామని ఇంకో రూ.15 లక్షలు చెల్లించి బాడీ తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి. మూడు గంటల పాటు గ్రామస్తులంతా ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో బకాయి బిల్లు లేకుండానే మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రానికి మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వర్గాలు బాధితకుటుంబానికి రూ.2 లక్షలు అందజేసినట్లు సమాచారం.
చదవండి: చెరువులో విషప్రయోగం..
చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
Comments
Please login to add a commentAdd a comment