lingala ghanapuram
-
అయ్యో పాపం! ఇప్పుడే వస్తానంటూ.. ‘వెళ్లిపోయింది’
జనగామ: పక్షవాతంతో మంచాన పడిన భర్త.. ఆయనకు సపర్యలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్య.. ఏదో పనుండి ఇంట్లో నుంచి బయటకెళ్లిన భార్య కాస్తా కారు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడే వస్తానన్న భార్య మాట కోసం రెండు గంటలపాటు ఎదురుచూసి ఇక ఎప్పటికీరాదన్న విషయాన్ని తెలుసుకుని తను ఒంటరైపోయానని తల్లడిల్లిపోతున్న వైనం స్థానికుల్ని కలచివేస్తోంది. కష్టాల కడలిలో సంసార నావను ఈదుతోన్న కుటుంబాన్ని కారు ప్రమాద రూపంలో నిలువునా ముంచేసిన వైనం బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని లింగాల ఘనపురం మండలం వడిచెర్లకు చెందిన నంగునూరి సత్యనారాయణ, లక్ష్మి(65) దంపతులు జనగామలోని ఓల్డ్ లక్ష్మీకృష్ణ థియేటర్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాస ముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చిన్నతనం లోనే పిల్లలు చనిపోగా సత్యనారాయణ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నాళ్ల క్రితం పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో సత్యనారాయణ మంచానికే పరిమితమైపోయాడు. అప్పట్నుంచి ఆయనకు లక్ష్మి సపర్యలు చేస్తూ వస్తోంది. కుటుంబ పోషణ కోసం శ్రీచెన్న కేశ్వరస్వామి ఆలయంతోపాటు ఓ ప్రభుత్వ కార్యాలయంలో లక్ష్మి పనికి కుదిరింది. వచ్చిన డబ్బులతో భర్తకు వైద్యం చేయిస్తూ బతుకు బండి లాగిస్తోంది. ఈ క్రమంలో ఏదో పనుండి లక్ష్మి బయటకు వెళ్లాల్సి రావడంతో.. భర్తకు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో పక్కనే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య ఇంటి నుంచి ఆమె కుమారుడి కారును డ్రైవర్ వెనక్కి తీసుకొస్తుండగా అదుపుతప్పి కారు లక్ష్మి మీదకు దూసుకొచ్చింది. అప్పటికే తనవైపుగా వస్తున్న కారును చూసి ‘‘బాబూ.. మెల్లగా రా బాబూ’’..అంటూ లక్ష్మి ఎంత అరిచినా డ్రైవర్ వినిపించుకోకుండా కారును ఆమె పైనుంచి పోనివ్వడంతో లక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: ఇళ్లంతా సందడి.. కానీ చూస్తుండగానే..!) -
చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు
బంజారాహిల్స్/ లింగాలఘణపురం: చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్తే అక్షరాల రూ.25లక్షల బిల్లు వేశారు.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు కొంత అప్పు చేసి సుమారు రూ.9లక్షల వరకు చెల్లించారు. అయినా చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నాగరాజు (32)కు ఈనెల 7వ తేదీన లింగాలఘన్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స నిమిత్తం బంధుమిత్రులంతా తలా కొంత పోగు చేసుకొని రూ.9లక్షల దాకా చెల్లించారు. ఈక్రమంలో అక్కడ అందుతోన్న చికిత్సతో కోలుకుంటున్నాడని అందరూ భావించారు. రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అడిగినంత డబ్బు చెల్లిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం నాగరాజు మృతి చెందాండంటూ ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. రెండు రోజుల క్రితం కూడా తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడంటూ బంధుమిత్రులు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేయి విరిగిందని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 లక్షల బిల్లు వేశారని ఇప్పటికే రూ.9 లక్షలు చెల్లించామని ఇంకో రూ.15 లక్షలు చెల్లించి బాడీ తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి. మూడు గంటల పాటు గ్రామస్తులంతా ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో బకాయి బిల్లు లేకుండానే మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రానికి మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వర్గాలు బాధితకుటుంబానికి రూ.2 లక్షలు అందజేసినట్లు సమాచారం. చదవండి: చెరువులో విషప్రయోగం.. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
వారంలో జనగామకు వస్తా..
లింగాలఘణపురం: వారం రోజుల్లో జనగామకు వస్తా..చీఫ్ ఇంజనీర్, ఇంజనీర్లతో వచ్చి కలెక్టర్‌ను కూర్చోబెట్టి తొవ్వ తీస్తా. వీలైనంత తొందరలో నీళ్లు అందించేందుకు సాయం చేస్తానని భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. రఘునాథపల్లి మండల అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వ జనగామ పట్టణంలో భూసేకరణ రెండున్నర కిలో మీటర్లు ఆగిపోయింది. దీంతో అసంపూర్తిగా ఉన్న కాల్వ నిర్మాణంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మండలంలోని అన్ని గ్రామాల రైతులు మంగళవారం హైదరాబాద్‌లో భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావును ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ‘కాల్వ పూర్తి కాదు..నీళ్లు రావు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంలోని వివరాలను ఎమ్మెల్యే రాజయ్య మంత్రి హరీష్‌రావుకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ప్లాట్లు ఉండడంతో భూసేకరణ జరుగలేదని, చుట్టూ నీళ్లు వచ్చి మీకు రాకపోవడంతో ఎవరికైనా బాధ ఉంటది.. ఇక్కడ మాట్లాడినట్లు ఒక్క నిమిషంలో అయ్యే పనులు కావు.. జనగామకే వచ్చి ఒక పూట ఉంట కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వోను పిలిపించి మాట్లాడుతా. ఏదో తొవ్వ తీసి వీలైనంత తొందరగా నీళ్లు వచ్చేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగేందర్, జెడ్పీటీసీ రంజిత్‌రెడ్డి, మండల ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శ్రీనువాసు, మార్కెట్ డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, భాగ్యమ్మ, నాయకులు బోయిని రాజు, దూసరి గణపతి, దుంబాల భాస్కర్‌రెడ్డి, పోకల శంకరయ్య, గవ్వల మల్లేశం, లింగాల వెంకటేష్, వీరయ్య, శ్రీనువాసురెడ్డి ఉన్నారు. -
గణపతీ.. ఇదేమి దుస్థితి
నిమజ్జనానికి నీరు కరువు మూడేళ్లుగా ఇదే పరిస్థితి గంగమ్మ కోసం గ్రామస్తుల ఎదురుచూపు ఈ వి‘చిత్రం’ చూశారా..! ఈ విగ్రహాలను చూస్తుంటే వినాయక చవితి ఉత్సవాల కోసం తయారు చేసి అమ్మకం కోసం పెట్టినట్టు కనిపిస్తోంది కదూ.. కానీ ఇది నిజం కాదు. ఇవి ఇప్పటికే నవరాత్రుల పాటు పూజలందుకున్న విగ్రహాలే. లింగాల ఘణపురం మండల కేంద్రంలోని చెరువులో నీళ్లు లేక ఇలా మట్టిలోనే వదిలేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా ఇక్కడ మాత్రం చుక్కనీరు పడలేదు. ఈ ఒక్క ఏడాదే కాదు.. గత మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎటూ చూసిన కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో సైతం ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వీధివీధినా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను ఇలా చెరువులో వదిలేసిన భక్తులు గంగమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. -
రిజర్వాయర్ల చుట్టూ ఆయకట్టు.. ఎకరం పారితే ఒట్టు!
లింగాలఘణపురం రైతుల ఆర్తనాదాలు వినేవారే కరువు ఏళ్లుగా సా..గుతున్న భూసేకరణ ప్రక్రియ వర్షాకాలంలోనూ మండల ప్రజలకు తప్పని తాగునీటి తిప్పలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరిక లింగాలఘణపురం మండలంలో గత నాలుగేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతం ఎడారిగా మారొచ్చు. అక్కడ భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయాయి. వర్షాకాలంలోనూ తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు.ఇది సాక్షాత్తూ కేంద్ర జల వనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైన నిప్పులాంటి నిజం. ఇటువంటి కరువు పీడిత ప్రాంతాల గురించి ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది. అయినా ఏం లాభం? కరువు నివారణ చర్యలు మచ్చుకు కూడా కానరావడం లేదు. మండలం పరిధిలో పేరుకు నాలుగు రిజర్వాయర్లు ఉన్నా.. నేటికీ చుక్క సాగునీరూ అందడం లేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ కారణంగా ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెంతనే రిజర్వాయర్లు ఉన్నా.. ఫలితం సున్నా అన్న చందంగా తయారైంది ఆయకట్టు రైతుల పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. – లింగాలఘణపురం లింగాలఘణపురం మండలం స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లోని నాలుగు రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు కలిగి ఉంది. నామమాత్రంగా నాలుగు జలాశయాలు(రిజర్వాయర్లు) ఉన్నాయి. వాటితో స్థానిక రైతులకు ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదు. రిజర్వాయర్లకు సంబంధించిన ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణం కోసం భూములను సమీకరించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీన్ని వేగవంతం చేయాలంటే సంబంధిత అధికారులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మండల కేంద్రంలో ప్రజలు తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. వర్షాకాలంలోనూ ట్యాంకర్లతో నీటిని కొనుక్కుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అశ్వారావుపల్లి రిజర్వాయర్ పరిధిలో.. మండలంలోని నవాబుపేట, అశ్వారావుపల్లి, ఆర్ఎస్ ఘన్పూర్, చీటకోడూరు రిజర్వాయర్ల పరిధిలో సుమారు 24,500 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 0.73 టీఎంసీ సామర్థ్యం కలిగిన అశ్వారావుపల్లి రిజర్వాయర్ పరిధిలో లింగాల ఘణపురం, కళ్లెం, నాగారం, నెల్లుట్ల, జీడికల్, సిరిపురం గ్రామాల్లో 11,400 ఎకరాల ఆయకట్టు ఉంది. 35 కిలోమీటర్ల ప్రధాన కాల్వతో నల్గొండ జిల్లా ఆలేరు వరకు ఆయకట్టు విస్తరించి ఉంది. అశ్వారావుపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి పదేళ్లు గడిచినా ప్రధాన కాల్వల నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. జనగామలో రైల్వే ట్రాక్, యశ్వంతాపూర్ వాగు, జనగామ పట్టణంలోని ప్లాట్ల మధ్య పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రధాన కాల్వ నిర్మాణ పనులు పడకేశాయి. వెరసి సాగునీటితో పంటలు పండించుకోవాలనే ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ ఎన్నడో పూర్తయినా.. ఎన్నడో పూర్తయిన ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి 9ఎల్, 10ఎల్, 8ఎల్లో కొంతభాగం కుందారం, చీటూరు, నేలపోగుల గ్రామాల్లో 5,424 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. 214 ఎకరాల భూసేకరణలో ఇప్పటివరకు 14 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా భూసేకరణ జరుగుతూనే ఉంది. జనగామ పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన చీటకోడూరు రిజర్వాయర్ నుంచి పటేల్‌గూడెం, కళ్లెం గ్రామాల్లోని కొంత ఆయకట్టు ఉండగా, అత్యంత ఎక్కువ ఆయకట్టు నవాబుపేట రిజర్వాయర్‌కు ఉంది. 2009 సంవత్సరంలో రూ.262 కోట్లతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దీనికి శంకుస్థాపన చేశారు. 0.47 టీఎంసీ సామర్థ్యంతో లింగాల ఘణపురం, దేవరుప్పుల, నల్గొండ జిల్లా ఆలేరు, గుండాల మండలాల్లో 53,444 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. 2891 ఎకరాల భూసేకరణలో భాగంగా ఇప్పటిదాకా 2000 ఎకరాలను సేకరించి పనులు చేపట్టారు. మరో 800 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనికి లింగాలఘణపురం మండలంలోని వడిచర్ల, కొత్తపల్లి, నేలపోగుల, నవాబుపేట, వనపర్తి, గుమ్మడవెల్లి, లింగాలఘణపురం గ్రామాల్లో 7,583 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో ఏ ఒక్క రిజర్వాయర్ నుంచి కూడా కనీసం ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. ఏం చేయాలంటే.. ఎడారిగా మారే ప్రతికూల పరిస్థితులతో పోరాడుతున్న లింగాల ఘణపురం మండలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులపై ఉంది. వర్షాకాలంలోనూ నీళ్లు కొనాల్సిన దుస్థితి ఇకపై రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా అశ్వారావుపల్లి రిజర్వాయర్ ప్రధాన కాల్వ పనులను వేగవంతం చేయాలి. ఆ పనులను జనగామ రైల్వే ట్రాక్, యశ్వంతాపూర్ వాగు, జనగామ పట్టణంలోని ప్లాట్ల మీదుగా నల్గొండ జిల్లా సూర్యాపేట రోడ్డు వరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే రాజయ్య, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషిచేయాలి. చీటకోడూరు రిజర్వాయర్ నుంచి జలాలు మండలానికి చేరాలంటే పెంబర్తి, నాగారంలోని కాల్వల ద్వారా పారాల్సి ఉంది. జనగామ పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో చీటకోడూరు రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయగా , అక్కడ అవసరానికి మించి నీరు చేరితే తప్ప పెంబర్తి, నాగారం మీదుగా మండల కేంద్రానికి జలాలు చేరే అవకాశం లేదు. -
స్టాంప్ డ్యూటీ...పంచాయతీ
లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : రెవెన్యూ గ్రామాల నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాలు అన్యాయూనికి గురవుతున్నారుు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో లక్షలాది రూపాయల ఆదాయం రావాల్సిన పంచాయతీలకు పైసా కూడా రావడం లేదు. ఇంటి, నల్లా పన్ను, ఆస్తి మార్పిడితో పాటు పంచాయతీల పరిధిలో భూముల క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత శాతం గ్రామ పంచాయతీలకు జమవుతుంది. వీటితో ఆయా గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను తీర్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆదాయ వనరులు కేవలం రెవెన్యూ గ్రామాలకే జమ కావడంతో... నూతనంగా ఏర్పడిన పంచాయతీల పరిస్థితి అధ్వానం గా తయారైంది. వసూలు చేసిన పన్నులు పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నారుు. జిల్లావాప్తంగా ఇదే పరిస్థితి జిల్లాలో1098 రెవెన్యూ గ్రామాలుండగా... 962 గ్రామ పంచాయితీలున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు లింగాలఘణపురం మండలం తీసుకుంటే.. ఇందులో 14 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయితీలున్నాయి. వీటిలో కళ్లెం రెవెన్యూ పరిధిలో మాణిక్యాపురం, నెల్లుట్ల పరిధిలో పటేల్‌గూడెం, లింగాలఘణపురం పరిధిలో బండ్లగూడెం, వడిచర్ల రెవెన్యూ పరిధిలో నవాబుపేట గ్రామాలున్నాయి. 1994లో కళ్లెం రెవెన్యూ పరిధిలోని మాణిక్యాపురం విడిపోయిది... రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద నూతన గ్రామపంచాయతీకి రావాల్సిన ఒక్క పైసా అప్పటి నుంచి ఇప్పటివరకు నూతన పంచాయతీకి రాలేదు. జనగామ రెవెన్యూ డివిజన్‌కు దగ్గరగా ఉన్న మాణిక్యాపురం పరిధిలో వందలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. కానీ... రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద వచ్చిన లక్షలాది రూపాయలు కళ్లెం రెవెన్యూ పంచాయతీలోనే జమ అవుతున్నాయి. 1981లో నెల్లుట్ల నుంచి ఏర్పడిన పటేల్‌గూడెం పంచాయతీ పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.