-
లింగాలఘణపురం రైతుల ఆర్తనాదాలు వినేవారే కరువు
-
ఏళ్లుగా సా..గుతున్న భూసేకరణ ప్రక్రియ
-
వర్షాకాలంలోనూ మండల ప్రజలకు తప్పని తాగునీటి తిప్పలు
-
ఎడారిగా మారే ప్రమాదం ఉందని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరిక
లింగాలఘణపురం మండలంలో గత నాలుగేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతం ఎడారిగా మారొచ్చు. అక్కడ భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయాయి. వర్షాకాలంలోనూ తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు.ఇది సాక్షాత్తూ కేంద్ర జల వనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైన నిప్పులాంటి నిజం. ఇటువంటి కరువు పీడిత ప్రాంతాల గురించి ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది. అయినా ఏం లాభం? కరువు నివారణ చర్యలు మచ్చుకు కూడా కానరావడం లేదు. మండలం పరిధిలో పేరుకు నాలుగు రిజర్వాయర్లు ఉన్నా.. నేటికీ చుక్క సాగునీరూ అందడం లేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ కారణంగా ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెంతనే రిజర్వాయర్లు ఉన్నా.. ఫలితం సున్నా అన్న చందంగా తయారైంది ఆయకట్టు రైతుల పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. – లింగాలఘణపురం
లింగాలఘణపురం మండలం స్టేషన్ ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లోని నాలుగు రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు కలిగి ఉంది. నామమాత్రంగా నాలుగు జలాశయాలు(రిజర్వాయర్లు) ఉన్నాయి. వాటితో స్థానిక రైతులకు ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదు. రిజర్వాయర్లకు సంబంధించిన ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణం కోసం భూములను సమీకరించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీన్ని వేగవంతం చేయాలంటే సంబంధిత అధికారులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మండల కేంద్రంలో ప్రజలు తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. వర్షాకాలంలోనూ ట్యాంకర్లతో నీటిని కొనుక్కుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అశ్వారావుపల్లి
రిజర్వాయర్ పరిధిలో..
మండలంలోని నవాబుపేట, అశ్వారావుపల్లి, ఆర్‌ఎస్ ఘన్‌పూర్, చీటకోడూరు రిజర్వాయర్ల పరిధిలో సుమారు 24,500 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 0.73 టీఎంసీ సామర్థ్యం కలిగిన అశ్వారావుపల్లి రిజర్వాయర్ పరిధిలో లింగాల ఘణపురం, కళ్లెం, నాగారం, నెల్లుట్ల, జీడికల్, సిరిపురం గ్రామాల్లో 11,400 ఎకరాల ఆయకట్టు ఉంది. 35 కిలోమీటర్ల ప్రధాన కాల్వతో నల్గొండ జిల్లా ఆలేరు వరకు ఆయకట్టు విస్తరించి ఉంది. అశ్వారావుపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి పదేళ్లు గడిచినా ప్రధాన కాల్వల నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. జనగామలో రైల్వే ట్రాక్, యశ్వంతాపూర్ వాగు, జనగామ పట్టణంలోని ప్లాట్ల మధ్య పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రధాన కాల్వ నిర్మాణ పనులు పడకేశాయి. వెరసి సాగునీటితో పంటలు పండించుకోవాలనే ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు.
ఆర్‌ఎస్ ఘన్‌పూర్ రిజర్వాయర్
ఎన్నడో పూర్తయినా..
ఎన్నడో పూర్తయిన ఆర్‌ఎస్ ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి 9ఎల్, 10ఎల్, 8ఎల్‌లో కొంతభాగం కుందారం, చీటూరు, నేలపోగుల గ్రామాల్లో 5,424 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. 214 ఎకరాల భూసేకరణలో ఇప్పటివరకు 14 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా భూసేకరణ జరుగుతూనే ఉంది. జనగామ పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన చీటకోడూరు రిజర్వాయర్ నుంచి పటేల్‌గూడెం, కళ్లెం గ్రామాల్లోని కొంత ఆయకట్టు ఉండగా, అత్యంత ఎక్కువ ఆయకట్టు నవాబుపేట రిజర్వాయర్‌కు ఉంది. 2009 సంవత్సరంలో రూ.262 కోట్లతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దీనికి శంకుస్థాపన చేశారు. 0.47 టీఎంసీ సామర్థ్యంతో లింగాల ఘణపురం, దేవరుప్పుల, నల్గొండ జిల్లా ఆలేరు, గుండాల మండలాల్లో 53,444 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. 2891 ఎకరాల భూసేకరణలో భాగంగా ఇప్పటిదాకా 2000 ఎకరాలను సేకరించి పనులు చేపట్టారు. మరో 800 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనికి లింగాలఘణపురం మండలంలోని వడిచర్ల, కొత్తపల్లి, నేలపోగుల, నవాబుపేట, వనపర్తి, గుమ్మడవెల్లి, లింగాలఘణపురం గ్రామాల్లో 7,583 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో ఏ ఒక్క రిజర్వాయర్ నుంచి కూడా కనీసం ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు.
ఏం చేయాలంటే..
ఎడారిగా మారే ప్రతికూల పరిస్థితులతో పోరాడుతున్న లింగాల ఘణపురం మండలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులపై ఉంది. వర్షాకాలంలోనూ నీళ్లు కొనాల్సిన దుస్థితి ఇకపై రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా అశ్వారావుపల్లి రిజర్వాయర్ ప్రధాన కాల్వ పనులను వేగవంతం చేయాలి. ఆ పనులను జనగామ రైల్వే ట్రాక్, యశ్వంతాపూర్ వాగు, జనగామ పట్టణంలోని ప్లాట్ల మీదుగా నల్గొండ జిల్లా సూర్యాపేట రోడ్డు వరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే రాజయ్య, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషిచేయాలి. చీటకోడూరు రిజర్వాయర్ నుంచి జలాలు మండలానికి చేరాలంటే పెంబర్తి, నాగారంలోని కాల్వల ద్వారా పారాల్సి ఉంది. జనగామ పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో చీటకోడూరు రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయగా , అక్కడ అవసరానికి మించి నీరు చేరితే తప్ప పెంబర్తి, నాగారం మీదుగా మండల కేంద్రానికి జలాలు చేరే అవకాశం లేదు.