ఆన్లైన్లో పన్నుల వసూలు..!
నయా సిస్టమ్
* చేతిమిషన్తో పన్నుల వసూళ్లు, స్పాట్లో రసీదు
* అక్రమాలకు చెక్ పెట్టేందుకే అంటున్న అధికారులు
* నల్లగొండ జిల్లాలో వచ్చె నెల నుంచి అమలు
నల్లగొండ టుటౌన్: కాలం మారుతోంది.. ఇకపై పనులు మానుకొని గంటలకొద్దీ క్యూలో నిలబడి పన్ను చెల్లించాల్సిన పరి(దు)స్థితి లేదు.. అధికారులే మీ ఇంటికి వస్తారు.. ఆస్తి,నల్లా పన్నువసూలు చేస్తారు..కరెంటు బిల్లుమాదిరిగానే వెంటనే రసీదు మీ చేతికి ఇస్తారు..ఇదేంటి అనుకుంటున్నారా..? పన్నుల వసూలుకు మున్సిపల్ యంత్రాంగం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇకపై ఆస్తి, నల్లా పన్నులు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోస మున్సిపాలిటీ పరిధిలోని నివాసాలు, వాణిజ్య సముదాయ కాంప్లెక్స్‌లు, అపార్ట్మెంట్ల అసిస్మెంట్ల నంబర్లను ఆన్లైన్ చేతి మిషన్‌లో లోడ్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రతి బిల్ కలెక్టర్‌కు చేతి మిషన్..
మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు రసీదు బుక్‌ల ద్వారా బిల్ కలెక్టర్లు పట్టణంలో ఇంటింటికీ తిరిగి ఆస్తిపన్ను వసూలు చేసేవారు. ఇక నుంచి ప్రతి బిల్ కలెక్టర్ ఆన్లైన్ కలెక్షన్ చేయడానికి చేతి మిషన్లు ఇస్తారు. సంబంధిదిత బిల్ కలెక్టర్ నివాసాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల వద్ద నుంచి ఆస్తిపన్ను వసూలు చేసి వెంటనే అక్కడే రసీదులు ఇస్తారు. మరో మిషన్‌ను మున్సిపాలిటీ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచుతారు.
ఎవరైనా ఆస్తిపన్ను చెల్లించడానికి కార్యాలయానికి వస్తే ఇక్కడ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శతంగా వసూళ్ల ప్రక్రియ కొనసాగనుంది. ఏ బిల్ కలెక్టర్ ఏ ఏరియాలో ఉన్నాడు ... ఎంత వసూలు చేశాడు... రోజుకు ఎన్ని నివాసాలు తిరుగుతున్నాడు అనే పూర్తి సమాచారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే ఉండి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బిల్ కలెక్టర్లు వసూళ్లకు అని చెప్పి సొంత పనుల కోసం వెళ్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆన్లైన్ విధానం అమలులోకి వస్తే అలాంటి వారు ఇట్టే దొరికి పొతారు.
బీసీల అక్రమాలకు చెక్..
ఆన్లైన్ విధానం అమలైతే బిల్ కలెక్టర్ (బీసీ )ల అక్రమాలకు చెక్ పడనుంది. ఇప్పటి వరకు వాణిజ్య సముదాయాలు, నివాసాలు, అపార్ట్మెంట్ల వారి దగ్గర రికార్డు బుక్‌లో ఉన్న దానికంటే ఎక్కువ వసూలు చేసి ఆ తరువాత రసీదు బుక్‌లో దిద్దిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అదే విధంగా ఒక రోజు రూ.లక్ష ఆస్తిపన్ను వసూలు చేసి అదే రోజు కార్యాలయంలో పూర్తిగా చెల్లించకుండా సొంత ఖర్చులకు కూడా వాడుకునేవారు. ఇక ఇలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది.