ఈ పాట విన్నాక.. షేక్‌హ్యాండ్ ఇస్తే ఒట్టు!!
మనిషికి చేతితో ఎన్ని ఉపయోగాలుంటాయో తెలుసా? హాయిగా బుర్ర గోక్కోవచ్చు, చెవిలో వేలు తిప్పుకుని గులిమి తీసుకోవచ్చు.. ఇంకా చాలాచాలా పనులు చేయొచ్చు. వాటన్నింటినీ గుదిగుచ్చి చైతన్య ప్రసాద్ రాసిన పాటను కీరవాణి పాడి వినిపించారు. ఇటీవల రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఒక దర్శకుడి ఇంటివద్ద చిన్న గెట్ టు గెదర్ పెట్టుకున్నాయి.
కీరవాణి వాళ్లందరిలో పెద్దవారు కావడంతో సరదాగా ఈ పాటను పాడి వినిపించారు. కానీ.. విషయం ఏమిటంటే ఈ పాట విన్న తర్వాత ఎవరికైనా మీరు షేక్ హ్యాండ్ మాత్రం పొరపాటున కూడా ఇవ్వాలనుకోరు. ప్రముఖ గేయరచయిత చైతన్య ప్రసాద్ ఈ పాట రాయగా కీరవాణి ఆడియో కంపెనీ వెల్ రికార్డ్స్ సంస్థ దీని వీడియోను కూడా విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ వీడియో ఇప్పటికే హల్చల్ చేస్తోంది.
పాట లిరిక్ ఇదీ...
తలలోన పొలుసులై జిలపెట్టు చుండ్రును
గోరార హాయిగా గోకు చేయి
కళ్లలో పుసులను వేళ్ళతో తొలగించి
వాల్చూపు సొగసు కాపాడు చేయి
జలుబుతో నాసిక జలపాతమౌ వేళ
చీమిడి భల్లున చీదు చేయి
ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా
కెలికి కెలికి వెలికి తొలుచు చేయి
చెవి లోతు లోతులో చేరిన గులిమిని
చిటికెన వేలుతో చెణకు చేయి
గజ్జల సందులో ఘణమైన మట్టిని
నలుగుపెట్టిన యట్లు నలుపు చేయి