Hand work
-
శత చిత్ర పద్మం
శత చిత్ర పద్మం అంటే... వంద చిత్రాల్లో నటించారని కాదు. శత వసంతాలు పూర్తి చేసుకున్నారామె. ఊరికే వందేళ్లు నిండితే కూడా ఇంత పెద్ద సెలబ్రేషన్ ఉండేది కాదేమో! ఆమెలో ఒక చిత్రకారిణి ఉన్నారు. ఒక వ్యాపారవేత్త ఉన్నారు. అంతకు మించి జీవితానికి సుపథం వేయగలిగిన గొప్ప తాత్వికవేత్త ఉన్నారు. చీర మీద చెట్టు పద్మావతి నాయర్ (పద్మమ్) 1920లో కేరళ రాష్ట్రం, త్రిశూర్‌లో పుట్టారు. ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తారు. టీ తాగడం, న్యూస్ పేపర్ చదవడం పూర్తయిన తర్వాత తన స్నానపానాదులు, ఉపాహారం ముగించుకుని పదిన్నరకు ఉద్యోగానికి వెళ్లినంత కచ్చితంగా రోజూ తన డెస్క్‌కు చేరుతారు. ఒంటి గంట వరకు తన ప్రపంచంలో మునిగిపోతారామె. ఆమె ప్రపంచంలో చిలుకలుంటాయి, చెట్టు కొమ్మ మీద వాలిన జంట పక్షులుంటాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకుని విహరిస్తున్న కొంగలుంటాయి. పురి విప్పిన నెమళ్లుంటాయి. రేకులు విచ్చుకున్న పువ్వులుంటాయి. ఇవన్నీ చీర మీద రంగుల బొమ్మలుగా ఉండవచ్చు, వాల్ హ్యాంగింగ్స్గానూ ఉండవచ్చు. రోజూ పెయింటింగ్ కోసం మూడు గంటల సమయాన్ని కేటాయిస్తారామె. వందేళ్ల వయసులో చేతి వేళ్లు పట్టు దొరకడం కష్టమే. బ్రష్‌ను కదలకుండా పట్టుకుని డిజైన్‌కు తగినట్లు స్ట్రోక్స్ ఇవ్వడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అదే మాట అన్నప్పుడు ఆమె నవ్వుతూ ‘‘నేను పెయింటింగ్స్ మొదలు పెట్టిందే అరవై దాటిన తర్వాత. అప్పటి నుంచి రోజూ వేస్తూనే ఉన్నాను. అలా వేస్తూ ఉండడమే వేళ్లకు శక్తి. అయితే టస్సర్ మీద పెయింటింగ్ చేయడం కొంచెం కష్టమే’’ అన్నారు. పెయింటింగ్ చేసిన చీరకు ఆమె పదకొండు వేల రూపాయలు చార్జ్ చేస్తారు. పద్మమ్ బామ్మ వేసిన పెయింటింగ్ దుపట్టా మూడు వేలు. ‘‘నేనింత వరకు నా ఖర్చులకు పిల్లల దగ్గర చేయి చాచలేదు. నేను మనుమలు, మనుమరాళ్ల పుట్టిన రోజులకు నా డబ్బుతోనే బహుమతులిస్తాను కూడా’’ అంటారామె ఒకింత గర్వంగా. ఎవరికి వారే ఆధారం పద్మావతి నాయర్ బాల్యం కేరళలోని త్రిశూర్ జిల్లాలోని వడకంచెర్రిలోనే గడిచింది. పదిమందిలో తొమ్మిదో సంతానం. ఫోర్డ్ మోటార్స్ ఉద్యోగి కేకే నాయర్‌ను పెళ్లి చేసుకుని 1945లో ముంబయికి వెళ్లారామె. వారికి ఐదుగురు పిల్లలు. ఆ పిల్లలందరి దుస్తులూ తానే మెషీన్ మీద కుట్టేవారు. ఆడపిల్లల దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ కూడా చేసేవారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యేటప్పటికి అరవై దాటాయి. అప్పటి వరకు హాబీగా చేసిన పెయింటింగ్ కోసం పూర్తి సమయం కేటాయించారామె. తన సొంత సంపాదన మొదలు పెట్టింది కూడా అప్పుడే. మూడు దశాబ్దాలుగా విజయవంతంగా సాగుతోంది ఆమె పెయింటింగ్ కుటీర పరిశ్రమ. వందేళ్ల వయసులో కూడా డబ్బు సంపాదిస్తున్నాను. అవును, ఎందుకు సంపాదించకూడదు? అని ప్రశ్నిస్తారు పద్మమ్. ఆడపిల్లలనే కాదు ఎవరూ మరొకరి మీద ఆధారపడకూడదు. తమ మీద తాము ఆధారపడి జీవించాలి... అని ఆమె పేరెంటింగ్ ఫిలాసఫీ చెప్పారు. పద్మమ్కి ఏడుగురు మనుమలు– మనుమరాళ్లు, నలుగురు ముని మనుమళ్లు–మనుమరాళ్లు. ఆమెకు రోజూ ఒంటి గంట వరకు పెయింటింగ్స్‌తో గడిచిపోతుంది. మధ్యాహ్నం కొంత విశ్రాంతి. సాయత్రం కొంత సేపు టీవీ చూసిన తర్వాత మనుమలు– మనుమరాళ్ల నుంచి వచ్చిన వాట్సప్ మెసేజ్‌లు చూసుకోవడం, వాటికి బదులివ్వడం ఆమె వ్యాపకం. పిల్లల సెలవు రోజుల్లో వాళ్లకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాల్లో విస్తరించిన బంధువులందరినీ సోషల్ మీడియా వేదికగా పలకరిస్తుంది. స్నేహితులకు ఈ మెయిల్స్ చేస్తుంది. జీవితంలో ఏమున్నాయి? ఏమి లేవు? అని బేరీజు వేసుకుంటూ ఉంటే సంతోషాల కంటే కష్టనష్టాల తక్కెడ బరువెక్కుతుంది. ‘నా జీవితంలో నేనున్నాను’ అనుకుంటే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అదే ఆయుష్షును పెంచే ఔషధం. ఆనందంగా జీవించడానికి సాధనం. – మంజీర -
చేనేతల కళ ‘కల’
చీరాల: తరాల తరబడి వారిది ఆకలి పోరాటం. చేతి వృత్తి నే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే దుస్తులు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేసే వారు.. రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలి కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.100 కూడా సంపాదించలేని పరిస్థితి. తాను అధికారంలోకి వస్తే చేనేతలకు పూర్వవైభవం తీసుకువచ్చి ఆదుకుంటానని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వా త చేనేతల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడంలేదు. ఇబ్బందులు పెడుతున్న ఆప్కో... జిల్లాలో 33,184 మగ్గాలుండగా 25వేల చేనేత కార్మిక కుటుంబాల్లోని 70వేల మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 సహకార సంఘాల్లో 17,862 మంది చేనేతలు పని చేస్తున్నారు. వీరు తయారు చేసే వస్త్రాలను చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో కొనుగోలు చేయాలి. కానీ దీనిని సమర్థవంతంగా నడిపించేవారు కనుమరుగయ్యారు. దీంతో గత ఆరు నెలల నుంచి 20 శాతం మాత్రమే కొనుగోలు చే శారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన వస్త్రాలు సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ఈ దెబ్బకు సహకార సంఘాలు ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడంతో ఉపాధి లేక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు గతంలో ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు ప్రభుత్వం ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు. పాత బకాయిలు కూడా రాకపోవడంతో చేనేతలు అప్పుల పాలవుతున్నారు. నీరుగారిన చంద్రబాబు వాగ్దానాలు టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీంతో ఘనకార్యం సాధించినట్లు జబ్బలు చరుచుకుంటున్న పాలకులు చేనేతలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా మరిచారు. నాడు చేనేతల కోసం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. కానీ చేనేత, జౌళిరంగానికి కలిపి రూ. 99.87కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది చేనేత రంగానికి చెల్లించాల్సిన బకాయిల్లో సగానికి కూడా సరిపోవు. చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేట్ ఇస్తామని ఆ నాడు ప్రగల్భాలు పలికినా.. బడ్జెట్లో ఆ ఊసేలేదు. సగం ధరకే జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకున్నారు. వృద్ధ చేనేత కార్మికులకు ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం తదితర పట్టణాల్లో వృద్ధాశ్రమాలు, ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్న బాబు.. ఇప్పుడేమో ప్లేటు తిరగేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 76940 మందికి చేనేత పెన్షన్లు ఇస్తున్నారు. దీనితో పాటు వంద రోజుల ప్రణాళికలో 3276 మందికి అదనంగా పెన్షన్ ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. రూ. 1.50 లక్షలతో 13 జిల్లాల్లో 901 మందికి వర్క్షెడ్లతో కూడిన ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎంగారికి ఆ మాట గుర్తుందో లేదో మరి. ప్రమాణ స్వీకారం చేసే రోజు చేనేత రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల మొత్తం రూ. 119కోట్లు రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 176కోట్లు చేనేత రుణాలున్నాయి. కానీ వీటితో పాటు సహకార సంఘాలు సీసీ కింద తీసుకున్న రూ. 26కోట్ల లెక్క చూపించలేదు. మొత్తం మీద రూ. 202కోట్లు రద్దు కావాల్సి ఉండగా కేవలం రూ. 119 కోట్లు మాత్రమే అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో! రైతు, డ్వాక్రా రుణాలు రద్దు కోసం జీఓ నెం. 174ను విడుదల చేశారు. అయితే అందులో చేనేత ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ముందుగా ప్రకటించినట్లు చేనేతలకు రూ. 1000 కోట్లు కేటాయించాలని.. చేనేత పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. వస్త్ర ఉత్పత్తిని సమీక్షించేందుకు ఓ మిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని చేనేతలు వ్యతిరేకిస్తున్నారు. పారిశ్రామిక వేత్తల చేతుల్లో తమ బతుకులు పెట్టేందుకే ఈ ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆరోపిస్తోంది.