పేదరికాన్ని జయించి.. ఆంధ్రజట్టు కెప్టెన్‌గా! విధికి కన్నుకుట్టిందేమో..
బాపట్ల: చిరుతలా దూసుకుపోతూ.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఆట అతని సొంతం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఏదైనా తనదైన శైలితో హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తాచాటేవాడు. జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అప్రతిహత ప్రస్థానం చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. అనారోగ్యం రూపంలో కబళించింది. ఆట గుండె ఆగినట్టు క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. కన్నీటితో క్రీడావీరుడు హర్షవర్ధన్‌కు కడసారి వీడ్కోలు పలికింది.
పేదరికాన్ని జయించి..
కోటపాడు గ్రామానికి చెందిన ఆవుల హర్షవర్ధన్ రెడ్డి (23) హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు. జాతీయస్థాయిలో రాణిస్తూ అంతర్జాతీయ శిక్షణకు ఎంపికయ్యాడు. తన కలలు త్వరలో తీరతాయని ఆనందపడిపోయాడు. అంతలోనే విధి అతనితో వింత ఆట ఆడింది. అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించాడు. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. హర్షవర్ధన్‌ది అతి నీరు పేద కుటుంబం. ఐదేళ్ల క్రితం అతడి తండ్రి శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు.
కోటపాడు గ్రామంలో ఉండటానికి ఇల్లు కూడా లేదు, తల్లి శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించింది. హర్షవర్ధన్ పేదరికాన్ని జయించి హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచాడు. భారత్ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. మంచి ఉద్యోగం సాధించి తన తల్లిని మంచిగా చూసుకోవాలని తోటి క్రీడాకారులు, స్నేహితులకు చెబుతుండేవాడు. ఆ కలలు నెరవేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నిత్యం చలాకీగా ఉరుకుతూ ఉండే కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లి శ్రీదేవి గుండెలవిసేలా రోదించింది. తోటి క్రీడాకారులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.
హ్యాండ్‌బాల్‌పై అమితమైన ప్రేమ..
హర్షవర్ధన్ రెడ్డి చిన్ననాటి నుంచి క్రీడలపై ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. 9వ తరగతి నుంచి తను హ్యాండ్‌బాల్ ఆడటం ప్రారంభించాడు. ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని మరింత ప్రోత్సహించారు. ఇంటర్మీడియెట్ నుంచి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో చేరాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో హ్యాండ్‌బాల్‌లో శిక్షణ పొందాడు. ఎన్నో పతకాలు సాధించాడు.
ఆంధ్రజట్టుకు కెప్టెన్‌గా..
ఇప్పటికి రెండుసార్లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించాడు. హ్యాండ్లోబాల్లో ఉన్న 16 మంది క్రీడాకారుల్లో 4వ వాడిగా మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హ్యాండ్ బాల్ శిక్షణకు ఆంధ్రజట్టు నుంచి ఎంపికై నట్లు తోటి క్రీడాకారులు చెబుతున్నారు.
కుక్క కాటే.. ప్రాణం తీసిందా..
ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ 15 రోజుల క్రితం ఐదో సెమిస్టర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. మూడు రోజుల క్రితం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వణికిపోతూ ఉండడంతో తల్లి, స్థానికులు స్థానిక ఆర్ఎంపీ వద్ద చూపించి అక్కడి నుంచి మేదరమెట్ల వైద్యశాలకు తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించాడు. మూడు నెలల క్రితం గ్రామంలో హర్షవర్ధన్‌ను కుక్క కరిచింది. ఇంజక్షన్ చేసుకొని కళాశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోలేదు. దీనివల్ల ర్యాబిస్ వ్యాధితో చనిపోయి ఉంటాడని వైద్యులు చెప్పారు.
జాతీయ స్థాయిలో రాణింపు..
2023–24 సంవత్సరానికి రెండు నెలల క్రితం తమిళనాడులోని సేలంలో సౌత్ జోన్ జూనియర్ నేషనల్ క్రీడల్లో పాల్గొన్నాడు.
2022 మార్చిలో జూనియర్ నేషనల్ విజయవాడలో ఆడి మంచి ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు.
2021–22లో మధ్యప్రదేశ్‌లో సీనియర్ నేషనల్ గేమ్స్‌లో ఆడాడు.
2023–24 రాయలసీమ యూనివర్సిటీ గేమ్‌లో మొదటి స్థానం సాధించాడు.
2021–22 ఢిల్లీలో జరిగిన జూనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో ఆడాడు.
2019 అండర్–17 స్కూల్ గేమ్స్‌లో కర్నాటకలో ఆడాడు.