ఆరడుగులకు ఒక్క అంగుళం ఎత్తున్నా మనం తాడిచెట్టు అనేస్తాం. అబ్బో ఎంత ఎత్తో అని అబ్బురపడిపోతాం. అలాంటిది ఏకంగా 13 అడుగుల 10 అంగుళాల ఎత్తుంటే ఏమనాలి..? అనేదేముంది.. గిన్నిస్ రికార్డు కట్టబెట్టేస్తే పోలా..?! అనుకున్నారు నిర్వాహకులు. అంతే.. గిన్నిస్ ప్రపంచరికార్డుల్లోకి ఈ పొడవైన గణాంకాలు చేరిపోయాయి.
నిజానికి ఈ ఎత్తంతా ఒక్క వ్యక్తిదే కాదు లెండి. చైనాలోని ఓ జంటది. 7 అడుగుల 8.98 అంగుళాల ఎత్తున్న సన్ మింగ్ మింగ్ (33), 6 అడుగుల 1.74 అంగుళాలుండే క్సు యాన్ (29) భార్యాభర్తలు. వీరిద్దరూ చైనాలో పెద్ద క్రీడాకారులు కూడా. మింగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కాగా, యాన్ హ్యాండ్‌బాల్ ప్లేయర్. ఓ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కలుసుకున్న వీరిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. తర్వాత 2013లో బీజింగ్‌లో వివాహంతో ఒక్కటయ్యారు. రికార్డుల వరకూ బాగానే ఉన్నప్పటికీ కారు, విమానంలోనూ ప్రయాణించేటప్పుడు ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు ఈ దంపతులు!