హెడ్‌బాల్ యాత్ర!
చదివింత...
‘‘తంతే ఫుట్‌బాల్... తలకెత్తుకుంటే రికార్డుల్’’ అంటున్నాడు జూవాన్ మార్క్వెజ్ నీటో. మెక్సికోకు చెందిన ఈ యువకుడు ఫుట్‌బాల్‌ని తలపై పెట్టుకున్నాడు. అంతటితో ఊరుకున్నాడా అంటే లేదు... బంతిని దించకుండానే ఊర్లకు ఊర్లే చుట్టేశాడు. ఏకంగా 56 రోజుల పాటు 1240 మైళ్లు నడిచేశాడు. 2011లో 1.50 గంటల్లో ఏడున్నర మైళ్లు ఇలాగే నడిచి గిన్నిస్ రికార్డు సాధించిన నీటో... గత ఏడాది నవంబర్ 23న బాల్ వాక్ ప్రారంభించి... తొమ్మిది రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించాడు.
మెక్సికోలో హింస, పిల్లలపై దమనకాండ ఆపాలని విజ్ఞప్తి చేస్తూ సాగిందీ బంతి యాత్ర. హింసాకాండ, కిడ్నాప్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానిక పౌర సంఘాల మద్దతు పుష్కలంగా అందుకున్న నీటో... ‘‘శాంతిని మించింది లేదు... దాన్ని సాధించేవరకూ బంతిని దించేదీ లేదు’’ అంటూన్నాట్ట!