ప్రభుత్వ అధికారికి ఆసరా పింఛన్
ఐదేళ్ల పాటు రూ.69 వేలు మింగిన వైనం
డీఆర్డీఏ శాఖలో ఓ అధికారి నిర్వాకం
సంగారెడ్డి క్రైం: ఏ ఆసరా లేని వారి కోసం ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ ఓ అధికారి అక్రమంగా మింగేస్తున్నారు. దాదాపు ఐదేళ్లపాటు వికలాంగుల కోటాలో మొత్తం 69 వేలు జమ చేసుకున్నాడు. విశ్వసనీయ కథనం మేరకు.. డీఆర్డీఏ శాఖలో నీరుడి డాకయ్య ఫైనాన్స్ ఏపీఎంగా, ఇన్చార్జి డీపీఎంగా పనిచేస్తున్నారు. ఆయన దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామం నుంచి తెల్ల రేషన్‌కార్డు జతపరిచి సదరం శిబిరంలో వికలాంగుల ధ్రువపత్రం (54 శాతం) పొందాడు.
తన సొంత శాఖలో ఆసరా పథకం కింద పింఛన్ మంజూరు చేయించుకున్నాడు. ఇలా 2010 నుంచి 2015 మే వరకు మొదటి మూడున్నరేళ్లలో వెయ్యి రూపాయల చొప్పున రూ.42 వేలు, ఏడాదిన్నరలో రూ.1,500 చొప్పున రూ.27 వేలు.. ఇలా మొత్తం రూ.69 వేలు స్వాహా చేశాడు. ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు చెల్లించాల్సిన పింఛన్ ఇలా ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు స్వాహా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.