నేటినుంచి ‘సదరమ్’
⇒ తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో నిర్వహణ
⇒ మండలాల వారీగా తేదీలు ఖరారు
తాండూరు రూరల్: మళ్లీ సదరమ్ క్యాంపు నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల సదరమ్ క్యాంపులు ఎత్తివేయడంతో జిల్లాలోని పలుచోట్ల వికలాంగులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 18న వివిధ మండలాల నుంచి భారీగా తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వచ్చిన వికలాంగులు సదరమ్ క్యాంపు ఎత్తివేశారని తెలుసుకుని ధర్నాకు దిగారు. ఆగ్రహంతో ర్యాలీగా వెళ్లి మంత్రి మహేందర్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అధికారులు సదరమ్ క్యాంపును తిరిగి నిర్వహించాలని మండలాల వారీగా తేదీలను ఖరారు చేశారు.
శారీరక వైకల్యం, అంధులు, చెవుడు, మూగ వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సదరమ్ ఇన్చార్జి బాలకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని విషయాలు..
⇒ ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 21 వరకు క్యాంపు కొనసాగుతుంది.
⇒ సదరం క్యాంపునకు వచ్చే వికలాంగులు ఆయా మండలాల్లోని ఐకేపీ సిబ్బంది వద్ద టోకెన్ తీసుకుని రావాలి.
⇒ టోకెన్‌పై ఎంవీఎస్ ముద్రతోపాటు సీసీ సంతకం తప్పనిసరి.
⇒ గతంలో వికలాంగత్వ సర్టిఫికెట్లు ఉన్నవారు క్యాంపునకు రావొద్దు.
⇒ కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆయా మండలాలకు చెందిన వారు క్యాంపునకు హాజరుకావాలి.