వ్యాపారాభివృద్ధికి శిక్షణ దోహదం
నరసాపురం రూరల్: మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా లేసు అల్లికల మహిళలను తీర్చిదిద్దేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని హస్తకళల అభివద్ధి అధికారి లంక మనోజ్ అన్నారు. మండలంలోని రుస్తుంబాద గ్రామంలోని ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటర్లో ‘వ్యాపారవేత్తలుగా ఎదగడం ఎలా’ అంశంపై శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించారు. న్యూఢిల్లీకి చెందిన ఈపీసీహెచ్, కేంద్ర హస్తకళల అభివద్ధి కమిషన్ సహకారంతో ఈనెల 20వ తేదీ వరకు శిక్షణ నిర్వహిస్తామని ఐఎల్‌టీసీ ప్రోగ్రాం ఆఫీసర్ రాహుల్ రంజన్ తెలిపారు. ప్రస్తుతం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ప్రారంబించామన్నారు. మొత్తం 14 బ్యాచ్‌ల ద్వారా 280 మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. నరసాపురం ప్రాంత లేసు అల్లికలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఆధునిక అవసరాలకు అనుగుణంగా అల్లికలను రూపుదిద్దేందుకు శిక్షణలు దోహదపడతాయన్నారు. పూర్తిస్థాయి శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం హస్త కళల అభివద్ధికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అల్లికా మహిళలు గుర్తించి శిక్షణ పారదర్శకంగా పొందాలని వారు సూచించారు. ఐఎల్‌టీసీ కన్వీనర్ కలవకొలను తులసీరావు, శిక్షకుడు, వైఎన్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎం.సత్యనారాయణ (ఎంఎస్ఎన్), ఏసురాముడు, దివాకర్, రాహుల్ పాల్గొన్నారు.