ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్టు.. రూ.5.95 లక్షలు స్వాధీనం
కారంపూడి(గుంటూరు): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5,95,020 నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ కె నాగేశ్వరరావు గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా కారంపూడిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక వినుకొండ రోడ్డులోని ఓ ఇంట్లో బుధవారం దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు వారిపై దాడి చేశారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్న కారంపూడికి చెందిన ముత్యాలంపాటి పుల్లారావు, మాచర్ల నెహ్రూ నగర్ రెండో లైన్‌కు చెందిన కొప్పల గోపీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5,95,020 నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన జక్కా మస్తాన్‌రావు అనే బుకీ కింద సబ్ బుకీలుగా కమీషన్‌కు పనిచేస్తున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. మస్తాన్‌రావును అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు.