‘హంద్రీ’... ఆగిందోచ్..!
రైలు ప్రయాణీకులకు శుభవార్త
సోమవారం రాత్రి తొలి హాల్ట్
అలంపూర్, న్యూస్‌లైన్ :
జోగుళాంబ హాల్ట్ కల ఎట్టకేలకు నెరవేరింది. దాదాపు ఎనిమిది నెలలుగా దోబూచులాడుతున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్(ఇంటర్సిటీ) రైలు ఎట్టకేలకు సోమవారం రాత్రి ఆగింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో జోగుళాంబ హాల్ట్ వద్దకు చేరుకున్న రైలు నిలిచింది. రైల్వే ఉన్నత శాఖ నుంచి స్థానిక స్టేషన్లకు హాల్ట్ సమాచారం అందింది. ఉదయం కర్నూలులో 6.05 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్....జోగుళాంబ హాల్ట్‌కు ఉదయం 6.15 నిమిషాలకు చేరుకొని ఆగాల్సి ఉండేది. కానీ ఎప్పటిలాగే స్టాప్‌లేకుండా దూసుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో సీసీఐ ద్వారా హైద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో వచ్చే హంద్రీ అగుతుందని స్పష్టమైన సందేశం వచ్చింది.
ప్రయాణీకులకు టికెట్లు సైతం అందుబాటులో ఉంచాలనే సమాచారం అందింది. దీంతో టికెట్ నిర్వాహకుడు రాజేశ్వర్‌రెడ్డి అందుకు చర్యలు తీసుకున్నారు. ఇలా ప్రయాణికులతో వచ్చిన రైలు రాత్రి 10 గంటల సమయంలో జోగుళాంబ హాల్ట్‌లో ఆగి అందర్నీ ఆనందపరిచింది. హైదరబాదు నుంచి ఈ రైలులో వచ్చిన మానవపాడు మండలం ఏ-బూడ్దిపాడు గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, శ్రీనువాసులు అనే ఇద్దరు ప్రయాణికులు ఇక్కడే దిగారు. తమకు విషయం తెలియక కర్నూలు వెళ్లాలనుకున్నామని...తీర ఇక్కడ రైలు ఆగడంతో దిగామన్నారు. ప్రశాంతంగా ఇంటికి వెళ్లడానికి అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.