రేపు హంద్రీ–నీవా–2కు నీరు విడుదల
అనంతపురం సెంట్రల్ : బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఈ నెల 24న హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీరు విడుదల చేయనున్నట్లు చీఫ్ ఇంజనీర్ (సీఈ) జలంధర్ తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 20న నీటిని వదలాలని తొలుత భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావడానికి కషి చేస్తున్నామని వివరించారు.
ఇప్పటివరకూ శ్రీశైలం డ్యాం వద్ద 7.09 టీఎంసీల నీరు విడుదలైందని, జీడిపల్లి జలాశయానికి నాలుగు టీఎంసీలు చేరిందని తెలిపారు. హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీళ్లు విడుదల చేసిన అనంతరం మిగిలిన నీరంతా పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు పంపుతామని చెప్పారు.