Handri-Neva
-
ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా!
పెనుకొండ: రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ నిలదీశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్’ పేరిట హిందూపురంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాతే ఈ ప్రాంత ప్రాజెక్టులపై వారికి శ్రద్ధ పుట్టుకొచ్చిందని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టులను పూర్తిగా అశ్రద్ధ చేశారన్నారు. చంద్రబాబు హంద్రీ–నీవాను తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారని, కానీ వైఎస్సార్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ కల్పతరువుగా మార్చారని వివరించారు. 1995 నుంచి 2004 వరకు హంద్రీ–నీవాపై టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.9 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ కష్టాలు తెలిసిన వ్యక్తిగా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.6,500 కోట్లతో హంద్రీ–నీవాకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన అరకొర పనులను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేదని, పైగా 200 శాతం అధికంగా అంచనాలు పెంచుకుని బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా టీడీపీ నేతలు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథిలకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టొద్దు రాయలసీమకు సాగునీటిని అధికంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. నీళ్లన్నీ సీమకే తీసుకెళ్తున్నారంటూ ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో మాట్లాడించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంత రైతుల పట్ల వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ద్వంద్వ వైఖరి మానుకునేలా చంద్రబాబును నిలదీయాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరిన్ని కృష్ణా జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేశామని తెలిపారు. గండికోట రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను, కుట్రపూరిత సదస్సులను మానుకుని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. -
గాలేరు–నగరి.. హంద్రీ–నీవా అనుసంధానం
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ అనుసంధానం, చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 1.41లక్షల ఎకరాలు సస్యశ్యామలం వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు జలాశయాన్ని నిర్మించారు. కానీ, నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల ఇది నిండటంలేదు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొనడంతోపాటు చక్రాయిపేట మండలంలోని కాలేటివాగు జలాశయానికి కూడా నీరు చేరడంలేదు. అలాగే, హంద్రీ–నీవా సుజల స్రవంతి సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో భాగమైన శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్లకు కూడా నీళ్లందించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో.. కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి, ఆ జలాశయాలను నింపడం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని 1.41 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. వెలిగల్లుకు కృష్ణా జలాలు కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ. పాయింట్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు జలాశయంలోకి ఎత్తిపోసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అలాగే, కాలేటివాగు జలాశయం నుంచి రోజుకు 450 క్యూసెక్కులను ఎత్తిపోసి.. చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చెరువులను నింపుతారు. ఇదే జలాశయం నుంచి రోజుకు 1,550 క్యూసెక్కుల చొప్పున లిఫ్ట్చేసి.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 473 కి.మీ. వద్ద పోస్తారు. ఈ జలాలతో వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాలను నింపి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. కాగా, గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి 48 రోజుల్లో 8.164 టీఎంసీలను తరలించేలా ఈ పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని అంచనా. యురేనియం సమస్యకు విరుగుడు పులివెందుల, లింగాల మండలాల్లో వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి నీరు చేరడంలేదు. యురేనియం పరిశ్రమవల్ల మబ్బుచింతలపల్లి, కనంపల్లి, తుమ్మలపల్లి, కొట్టాలు భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి, వేల్పుల గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవడంవల్ల ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చిత్రావతి రిజర్వాయర్ నుంచి రోజుకు 350 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీలను తరలించి.. పులివెందుల, లింగాల మండలాల్లో చెరువులను నింపి, యురేనియం ప్రభావిత గ్రామాలకు జలాలను సరఫరా చేసి 25వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. -
హంద్రీ – నీవాకు గండ్లు
►నెర్రెలు చీలిన కాలువ వంతెన ►కాస్త వర్షానికే లీకు అవుతున్న నీరు ►నాసిరకంగా నిర్మించడంతోనే.. రాయచోటి రూరల్ : చిన్నమండెం మండలంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ మీద కేశాపురం గ్రామం రెడ్డివారిపల్లె దగ్గర మాండవ్యనదిపై నిర్మించిన వంతెన గోడలు నెర్రెలు చీలాయి. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో నీరు లీకవుతోంది. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలోకి నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో నెర్రెలు, గండ్లు పడిన చోట నుంచి నీరు లీకేజీ అవుతోంది. ఈ విధంగా దాదాపు 5–6 చోట్ల నుంచి నీరు కారుతోంది. ఈ వంతెన గోడలు పూర్తిగా పైనుంచి కింద వరకు నెర్రెలు చీలి పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఇది ఎప్పుడు కూలి పడిపోతుందోనని స్థానికులు, సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పర్యవేక్షణ శూన్యం వర్షాలు వచ్చిన సమయంలోనైనా ఈ కాలువలకు సంబంధించిన ఇంజినీర్లు ఇలాంటి ప్రాంతాల్లో పర్యవేక్షిస్తే వారికి లోటుపాట్లు తెలుస్తాయని ప్రజలు అంటున్నారు. ‘పనులు వచ్చాయి. చేశామా, బిల్లులు అయ్యాయా, వెళ్లామా అనేదే తప్ప, చేసిన పనులు ఎలా ఉన్నాయి, వర్షం వచ్చిన తరువాత పనుల్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా’ అనే విషయాలను పట్టించుకోవడం లేదు. పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఈ కాలువలకు నీరు విడుదల చేయలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, నీటిని వదిలిన తరువాత నిలుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించక పోవడంతో... ఏడాది క్రితం సుమారు రూ.3 కోట్ల నిధులతో ఈ వంతెన నిర్మించారు. దీనిని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సదరు కాంట్రాక్టర్లు ఈ కాలువను తవ్వే సమయంలో నిబంధనలు, నాణ్యత పాటించలేదు. కాలువ గోడలకు రక్షణగా పక్కనే ఉన్న చౌడు మట్టిని తోలించారు. ఇటీవల కురిసిన వర్షానికి రెడ్డివారిపల్లె నుంచి పెద్ద రెడ్డివారిపల్లెకు వెళ్లే రోడ్డు మార్గం కింది భాగంలో చౌడు మట్టికి గండ్లు పడ్డాయి. వరి మడులు, చేలల్లో పారుతున్న వర్షపు నీరంతా హంద్రీ–నీవా కాలువలోకి పోతోంది. దీంతో రోడ్డు అడుగు భాగంలో సొరంగం ఏర్పడింది. ఆ గ్రామం వైపు నడిచి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అది ఎక్కడ కుంగిపోయి, గండిలో పడిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. వాహనాలలో వెళ్లే వారి పరిస్థితి మరింత కష్టంగా ఉంది.