విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ
పెనుకొండ: రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ నిలదీశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్’ పేరిట హిందూపురంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాతే ఈ ప్రాంత ప్రాజెక్టులపై వారికి శ్రద్ధ పుట్టుకొచ్చిందని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టులను పూర్తిగా అశ్రద్ధ చేశారన్నారు. చంద్రబాబు హంద్రీ–నీవాను తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారని, కానీ వైఎస్సార్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ కల్పతరువుగా మార్చారని వివరించారు.
1995 నుంచి 2004 వరకు హంద్రీ–నీవాపై టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.9 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ కష్టాలు తెలిసిన వ్యక్తిగా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.6,500 కోట్లతో హంద్రీ–నీవాకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన అరకొర పనులను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేదని, పైగా 200 శాతం అధికంగా అంచనాలు పెంచుకుని బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా టీడీపీ నేతలు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథిలకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు.
ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టొద్దు
రాయలసీమకు సాగునీటిని అధికంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. నీళ్లన్నీ సీమకే తీసుకెళ్తున్నారంటూ ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో మాట్లాడించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంత రైతుల పట్ల వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ద్వంద్వ వైఖరి మానుకునేలా చంద్రబాబును నిలదీయాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరిన్ని కృష్ణా జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేశామని తెలిపారు. గండికోట రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యంతో నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను, కుట్రపూరిత సదస్సులను మానుకుని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment