హంద్రీ – నీవాకు గండ్లు
►నెర్రెలు చీలిన కాలువ వంతెన
►కాస్త వర్షానికే లీకు అవుతున్న నీరు
►నాసిరకంగా నిర్మించడంతోనే..
రాయచోటి రూరల్ : చిన్నమండెం మండలంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ మీద కేశాపురం గ్రామం రెడ్డివారిపల్లె దగ్గర మాండవ్యనదిపై నిర్మించిన వంతెన గోడలు నెర్రెలు చీలాయి. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో నీరు లీకవుతోంది. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలోకి నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో నెర్రెలు, గండ్లు పడిన చోట నుంచి నీరు లీకేజీ అవుతోంది. ఈ విధంగా దాదాపు 5–6 చోట్ల నుంచి నీరు కారుతోంది. ఈ వంతెన గోడలు పూర్తిగా పైనుంచి కింద వరకు నెర్రెలు చీలి పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఇది ఎప్పుడు కూలి పడిపోతుందోనని స్థానికులు, సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పర్యవేక్షణ శూన్యం
వర్షాలు వచ్చిన సమయంలోనైనా ఈ కాలువలకు సంబంధించిన ఇంజినీర్లు ఇలాంటి ప్రాంతాల్లో పర్యవేక్షిస్తే వారికి లోటుపాట్లు తెలుస్తాయని ప్రజలు అంటున్నారు. ‘పనులు వచ్చాయి. చేశామా, బిల్లులు అయ్యాయా, వెళ్లామా అనేదే తప్ప, చేసిన పనులు ఎలా ఉన్నాయి, వర్షం వచ్చిన తరువాత పనుల్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా’ అనే విషయాలను పట్టించుకోవడం లేదు. పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఈ కాలువలకు నీరు విడుదల చేయలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, నీటిని వదిలిన తరువాత నిలుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు పాటించక పోవడంతో...
ఏడాది క్రితం సుమారు రూ.3 కోట్ల నిధులతో ఈ వంతెన నిర్మించారు. దీనిని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సదరు కాంట్రాక్టర్లు ఈ కాలువను తవ్వే సమయంలో నిబంధనలు, నాణ్యత పాటించలేదు. కాలువ గోడలకు రక్షణగా పక్కనే ఉన్న చౌడు మట్టిని తోలించారు. ఇటీవల కురిసిన వర్షానికి రెడ్డివారిపల్లె నుంచి పెద్ద రెడ్డివారిపల్లెకు వెళ్లే రోడ్డు మార్గం కింది భాగంలో చౌడు మట్టికి గండ్లు పడ్డాయి. వరి మడులు, చేలల్లో పారుతున్న వర్షపు నీరంతా హంద్రీ–నీవా కాలువలోకి పోతోంది. దీంతో రోడ్డు అడుగు భాగంలో సొరంగం ఏర్పడింది. ఆ గ్రామం వైపు నడిచి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అది ఎక్కడ కుంగిపోయి, గండిలో పడిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. వాహనాలలో వెళ్లే వారి పరిస్థితి మరింత కష్టంగా ఉంది.