ఈసారీ అంతే!
ఖరీఫ్‌లో హంద్రీ–నీవా నీరు లేనట్టే!
ఫేజ్–1లోని ఆయకట్టు 1.18లక్షల ఎకరాలు
గతేడాది ఖరీఫ్‌కు 20 వేల ఎకరాలకు నీరిస్తామని ప్రకటన
ఇప్పటికీఖరారుకాని 36వ ప్యాకేజీ టెండర్లు..
33, 34 ప్యాకేజీల్లోనూ తూతూ మంత్రంగానే పనులు
పనులు పూర్తయ్యేందుకు మరో ఏడాదికిపైగా సమయం
మూడేళ్లుగా రైతులకు మాయమాటలతో కాలయాపన
ప్రధాన కాలువ విస్తరణ పేరుతో ఈ ఏడాదీ ఎత్తిపోతలకు బ్రేక్!
‘హంద్రీ–నీవా మొదటి విడతలోని ఆయకట్టుకు ఈ ఏడాది ఖరీఫ్‌కు నీరిస్తాం’’ - 2014 నుంచి సీఎంతో సహా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమతో పాటు జిల్లా మంత్రులు కూడా మూడేళ్లుగా ప్రకటనలతో ఊరిస్తున్నారు. అయితే ఆచరణలో మాత్రం చేతులెత్తేశారు. హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కేవలం చెరువులకు నీరు నింపి చేతులు దులుపుకునేలా వ్యవహరిస్తోందని మొదటి నుంచి విపక్షాలన్నీ ఘాటుగా విమర్శిస్తున్నాయి. రైతులు తమ మాటను విశ్వసించడం లేదని గ్రహించిన మంత్రులు గతేడాది ఆరంభంలో హంద్రీ–నీవా సీఈ జలంధర్, ఎస్ఈ సుధాకర్‌బాబుతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ప్రకటన చేయించారు. 33, 34 ప్యాకేజీల పరిధిలో 2016 ఆగస్టులో 20వేలు, డిసెంబర్‌లోగా మరో 20వేల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. 2017 మార్చికి మొదటివిడత పరిధిలో 1.18లక్షల ఎకరాలకు పూర్తిగా సాగునీరు అందిస్తామని ప్రకటించారు.
ఇదీ పరిస్థితి..
మొదటి విడతలో 30 –36 ప్యాకేజీలు మన జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇందులో 33వ ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీలో 17,300, 36వ ప్యాకేజిలో 80,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో గతేడాది 33, 34 ప్యాకేజీలలో డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించారు. వజ్రకరూరు మండలం చాబాల, ధర్మపురిలో జరుగుతున్న ఈ పనులు తూతూమంత్రంగా చేశారు. ప్రస్తుతం ఈ పనులను అర్థంతరంగా నిలిపేశారు. 34వ ప్యాకేజీలో ఇప్పటికీ భూసేకరణ జరగాల్సి ఉంది. గతేడాది ఖరీఫ్‌కు నీరిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ పనులు పూర్తి చేసేందుకు 2017 జూన్ వరకూ అగ్రిమెంట్‌ను పొడిగించారు. ఈ లెక్కన గతేడాది పనులు పూర్తికావు, నీళ్లివ్వలేమని అధికారులకే తెలుసు! కానీ వారు కూడా సత్యదూరమైన ప్రకటనలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం వచ్చే నెలకు పనులు పూర్తికావాలి. వాస్తవానికి మరో ఏడాది వరకు పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు.
36వ ప్యాకేజీలోనూ అసత్య ప్రకటనలే..
2017 మార్చిలోపు 36వ ప్యాకేజీ పరిధిలోని ఆయకట్టుకు కూడా నీరందిస్తామని సీఈ, ఎస్ఈ గతేడాది ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద అత్యధికంగా 80,600 ఎకరాల ఆయకట్టు ఉంది. రూ.93.92కోట్లతో ఈ పనులను ఓం – రే (జాయింట్ వెంచర్) చేసేది. కానీ ఈ టెండర్లు రద్దు చేసి అంచనా వ్యయం భారీగా పెంచి కొత్తగా రూ.336.15 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది చివరి త్రైమాసికంలో జీఓ విడుదల చేసింది. ఈ పనులకు టెండర్లు ఖరారై పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు పడుతుంది. కానీ ఈ మార్చికే నీళ్లిస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు. ఈ ప్యాకేజీ పరిధిలో 805.62 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంటే 202.34 ఎకరాలు ఇంకా రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.
పాలకుల నిర్లక్ష్యం...ఆయకట్టు రైతులకు శాపం
హంద్రీ–నీవా మొదటి విడత ప్రధాన కాలువ పనులు 2012లోనే పూర్తయ్యాయి. అప్పటి నుంచి జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికే మొదటి విడత పనులు పూర్తయ్యాయి. కేవలం డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తిచేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వొచ్చు. నీరు పొలాలకు పారి ఉంటే ఓమోస్తారుగా కరువు తీరేది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో కొందరైనా బతికేవారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. కేవలం చెరువులకు నింపి చేతులు దులుపుకుంటోంది. కనీసం చెరువుల కింద ఆయకట్టుకు కూడా ఇవ్వడం లేదు. హంద్రీ–నీవాపై విపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా మనసు మారలేదు.
ఈ ఏడాది నీటి ఎత్తిపోతల లేనట్లే !!
హంద్రీ–నీవా ద్వారా గతేడాది 28 టీఎంసీలు జిల్లాకు చేరాయి. ఈ ఏడాది 30 టీఎంసీల దాకా తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రధాన కాలువ విస్తరణ పేరుతో నీటి ఎత్తిపోతలు నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఏడాది కృష్ణాజలాలు ‘అనంత’లో కన్పించవు. గతేడాది ఖరీఫ్‌కే కనీసం 20 వేల ఎకరాలకు నీరిస్తామన్న అధికారులు ఈ ఏడాది కూడా ఇవ్వలేరు.