హంద్రీ-నీవా పనులకు వారంలో 2 రోజులు కేటాయిస్తా!
నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
పెద్దతిప్పసముద్రం: హంద్రీ నీవా కాలువల నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదని, వారంలో రెండు రోజుల పాటు హంద్రీ-నీవా పనుల వేగవంతానికే సమయాన్ని కేటాయిస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువులో గురువారం సీఎం చంద్రబాబు నీరు-చెట్టు పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో నీటి నిల్వలు పెంపొందించేందుకు నీరు-మీరు కార్యక్రమం చేపట్టి చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించారన్నారు. చిత్తూరు జిల్లాలో వర్షపాత నమోదు గణనీయంగా పడిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి ఇటు తాగునీరు, అటు సాగు నీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తాను కళ్లారా చూశానన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం హంద్రీ-నీవా కాలువేనన్నారు. దీని నిర్మాణం పూర్తి చేసి, కరవు రహిత జిల్లాగా తీర్చి దిద్దుతామని భరోసా ఇచ్చారు. అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలవారీ పింఛన్లను ఐదు రెట్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా పనులు నిలిచిపోవడానికి, టీడీపీ కారణమని ప్రతిపక్ష నాయకులు విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
నీళ్లే లేకపోతే మొక్కలు ఎక్కడ నాటుతారని, ప్రతిపక్షాలు పని గట్టుకుని చౌకబారు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోటి 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13,300 పంచాయతీల్లో వర్షపాతం 36 శాతానికి పడిపోయిందన్నారు. 1500 అడుగుల లోతు బోర్లు తవ్వినా నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేందుకు తాము తలపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో ప్రజలు కూడా తోడ్పాటునివ్వాలని సూచించారు.