కళ..విశ్వవ్యాప్తం
పెంబర్తి హస్తకళకు.. ‘సృష్టికి ప్రతిసృష్టి’ అనే పేరుంది.. ఈ ప్రాచీన కళకు కొత్త సొబగులు అద్ది విశ్వవ్యాప్తం చేస్తున్నాడు ఓ యువతేజం. వారసత్వ కళకు ఆధునిక హంగులు జోడించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు..మహేశ్వరం శ్రీనివాసచారిది జనగామ జిల్లా పెంబర్తి. ఎంబీఏ చేశాడు. చదువుకునే రోజుల్లోనే తండ్రి మధునాచారి నుంచి కులవృత్తి స్వీకరించాడు. నగిషీల తయారీలో నేర్పు సాధించాడు.ఎంత అద్భుతంగా నగిషీలు చేసినప్పటికీ దానికి సరైన మార్కెటింగ్ లేకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయి. చేసిన కళాఖండాన్ని నలుగురికి చూపించే ఓ వేదిక కావాలని శ్రీనివాసచారి ఆలోచన చేశాడు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అమ్మకాల ఐడియా వచ్చింది. దాన్నే అమలుచేసి సక్సెస్ అయ్యాడు.
జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు :
కాకతీయులు, నిజాం నవాబులకు అలంకరణ వస్తువులను అందించిన చరిత్ర కలిగిన ‘పెంబర్తి’ కళాకారులు ఇప్పటికీ వారసత్వంగా అద్భుత నగిషీలను తయారుచేసి అందిస్తున్నారు. కళాకారులు తయారు చేసిన వాటికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, పాలకుల ప్రోత్సాహం లేకపో వడంతో వారి జీవనం దినదిన గండంగా మారింది. కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారడమే కాకుండా తమ పిల్లలకు మంచి చదువులను చెప్పించలేని దుస్థితి. ఇలాంటి తరుణంలో పెంబర్తి గ్రామానికే చెందిన మహేశ్వరం శ్రీనివాసచారి నగిషీలను తయారు చేయడమే కాకుండా మార్కెటింగ్‌కు కొత్త ఆలోచన చేశాడు.
కళకు ఆధునికత అనుసంధానం..
చిన్నప్పటి నుంచి కంప్యూటర్ వినియోగంపై కొంత అవగాహన ఉన్నచారి.. తయారు చేసిన వస్తువులను ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నాడు.ఇందుకోసం 2013లో www.metalartisan.in వెబ్సైట్ ప్రారం భించాడు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు నచ్చిన కళా రూపాలను కొనుగోలు చేస్తున్నారు. కొందరు తమకు నచ్చిన రీతిలో కళా రూపాలను తయారు చేయించుకుంటున్నారు. 2014 నుంచి ఈ వెబ్సైట్ బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. విదేశాల నుంచి విçస్తృతంగా ఆర్డర్లు వస్తు న్నాయి. ముఖ్యంగా అమెరికా, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, మలేషి యా దేశాల నుంచి హస్తకళల కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలోని తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొత్తదారి దొరకడంపై శ్రీనివాసచారి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
రోజూ 14 గంటలు ఆన్లైన్లోనే..
ప్రాచీక కళకు ఆధునికతను జోడిం చిన శ్రీనివాసచారి ఆన్లైన్ మార్కెటింగ్‌లో బిజీ అయిపోయాడు. కస్టమర్లకు నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. ఉదయం 8 గంటలకే కంప్యూటర్ ముందు కూర్చొని తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా ఆయనతోపాటు తండ్రి మధునాచారి నగిషీలను తయారు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పుడు తోటి కళాకారులకు పనులు అప్పగిస్తున్నారు. తనతోపాటు మరో పది మందికి కూడా ఉపాధి చూపుతున్నాడు. తన 72073 66856 సెల్‌నంబర్‌కు రోజూ 10 నుంచి 15 ఆర్డర్లు వస్తున్నాయి.
మూడు భాషల్లో ప్రావీణ్యం..
గ్రామీణ నేపథ్యం ఉన్న చారి.. మూడు భాషలు మాట్లాడగలడు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వచ్చిన కాల్స్‌కు సమాధానం చెబుతాడు. దీంతో తనకు ఆన్లైన్ బిజినెస్ ఈజీ అయిపోయింది.
ప్రపంచ గుర్తింపు తీసుకొస్తా..
పెంబర్తి హస్తకళకు ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే నా లక్ష్యం. పెంబర్తి కలను కనుమరుగు కానివ్వొద్దు. నా చిన్నతనంలో మా కులవృత్తిలో 150 కుటుంబాలుండేవి. ఇప్పుడేవి?. కొంత ఇన్నో వేటివ్గా ఆలోచించే ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించా. కాస్త పర్వాలేదు. మంత్రి కేటీఆర్‌కు పెంబర్తిపై ట్విట్ చేస్తే ఆయన తిరిగి ట్విట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది.
– మహేశ్వరం శ్రీనివాసచారి