బాబోయ్...ట్రాఫిక్
- హంసలదీవి నుంచి సంగమం వరకు ఏటూ చూసినా వాహనాలే
- ఆరు కిలోమీటర్ల మేర నాలుగు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
- తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పుష్కరభక్తులు
కోడూరు
శత్ధాబాల చరిత్ర కలిగిన హంసలదీవి క్షేత్రంలోని పవిత్ర కృష్ణా సాగరసంగమానికి కనివిని ఎరుగని రీతిలో పుష్కరస్నానం చేసేందుకు భక్తులు తరలిరావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించాయి. హంసలదీవిలోని శ్రీవేణుగోపాలుడి సన్నిధి నుంచి సముద్రం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర సంగమ రహదారి వాహనాలతో కిక్కిరిపోయింది. పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి డాల్ఫిన్ భవనం వరకు వాహనాలు తప్పుకునే పరిస్థితి లేకపోవడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సాగరసంగమ చర్రితలో ఇంత వరకు ఎప్పుడూ ఇన్ని వాహనాలు ఒకేసారి రాలేదని, వాహనాల రద్దీకి రోడ్డు వెడల్పు సరిపోకపోవడంతో ఇంతలా ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని అధికారులు అంటున్నారు. కరకట్ట దగ్గర నుంచి హంసలదీవి వరకు రహదారికి ఒకవైపునా వాహనాలు భారీ మొత్తంలో ఆగిపోవడంతో భక్తులు ఏటూ కదలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పసిపిల్లలతో వచ్చినవారు సంగమం వరకు నడుచుకుంటూ వెళ్లి పుష్కరస్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ తీవ్రతను చూసిన భక్తులను సంగమం వరకు వెళ్లనీవ్వకుండానే పాలకాయతిప్ప దగ్గర నుంచే వెనుదిరిగి వెళ్లిపోవడం గమనార్హం.
మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు..
మధ్యాహ్నం 12గంటల సమయంలో సంగమ రహదారి మొత్తం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం 4 గంటల వరకు వాహనాలను క్రమబద్ధికరించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. తరువాత శింకు వంతెన దగ్గర నుంచి వంతులవారిగా వాహనాలను వదులుతూ కొంతమేర సమస్యను పరిష్కరించారు. అయితే రాత్రి 6గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూనే ఉంది. కోడూరు ప్రధాన సెంటర్లో సైతం వాహనాల రద్దీతో అనేకసార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది.