భూ వివాదంలో యువకుడి దారుణహత్య
పాపన్నపేట : భూ వివాదంలో యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని శానాయిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాగా తోటి ఇల్లరికపు అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన బక్కొళ్ల హన్మయ్యకు కొంతకాలం క్రితం నర్సమ్మతో వివాహం జరిగింది. ఆమెకు దుర్గమ్మ అనే కూతురు జన్మించాక అనారోగ్య పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది.
అనంతరం హన్మయ్య పోచమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాక.. గంగమణి అనే కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో మొదటి భార్య కుమార్తె దుర్గమ్మను మెదక్ మండలం ముత్తాయికోట గ్రామానికి చెందిన సత్తయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. అనంతరం రెండో భార్య పోచమ్మ కుమార్తె గంగమణిని శానాయిపల్లి గ్రామానికి చెందిన అంతయ్య, మల్లవ్వల దంపతుల కుమారుడు ఏసయ్య (30)తో పెళ్లి చేసి వారిని కూడా ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో సత్తయ్య, ఏసయ్యల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది.
ఈ నెల 24న ఏసయ్య కుమారులు ప్రభు, ప్రశాంత్‌లను వారి పెద్దనాన్న అయిన సత్తయ్య దూషించాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగాయి. కాగా గురువారం రాత్రి ఏసయ్య తన పొలానికి నీరు పారబెట్టేందుకు కాపాలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం తెల్లవారే సమయానికి ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య గంగమణి తన పెద్ద కొడుకు ప్రభును పొలం వద్దకు పంపింది. అక్కడికి వెళ్లే సరికి ఏసయ్య తలకు తీవ్రగాయాలై చనిపోయి ఉన్నాడు.
సత్తయ్యనే హంతకుడా?
కాగా తోడల్లుడు సత్తయ్య గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారు జామున సత్తయ్య చేతికి రక్తం అంటిన విషయాన్ని ఆయన భార్య దుర్గమ్మ గుర్తించి ఆ విషయమై నిలదీసింది. అంతలోనే ఏసయ్య తన పొలం వద్ద హత్యకు గురైన విషయం దుర్గమ్మకు తెలియడంతో ఆమె తన భర్త సత్తయ్యను నిలదీస్తూ ఏసయ్య హత్యకు సత్తయ్యనే కారకుడని ఆరోపించింది.
ఈ మేరకు పాపన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మెదక్ సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంగారెడ్డి నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ గ్రామంలో కలియ తిరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు సత్తయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఏసయ్య మృతి పట్ల గ్రామస్తులంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సత్తయ్యను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.