ఏపీటీడీసీని ప్రైవేటికరించే ఆలోచనను విరమించుకోవాలి
విజయవాడ(గాంధీనగర్) ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)ను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను టీడీపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి ఓబులేసు హెచ్చరించారు. ఏపీ టూరిజం కాంట్రాక్ట్ అండ్ మ్యాన్‌పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సమితి సమావేశం హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలోని 38 టూరిజం హోటల్స్‌ను లీజు పేరుతో పచ్చచొక్కాల వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. తిరుపతి , అలిపిరి టూరిజంను సైతం ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుపతి లాంటి ప్రదేశాల్లో టూరిజం ప్రైవేటుకు అప్పగించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. టూరిజం హోటల్స్‌లో వంట మనుషుల కొరత ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 151 ప్రకారం టూరిజంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు అరియర్స్‌తో సహా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సమావేశం అనంతరం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజా శంకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజా శంకర్ స్పందిస్తూ 4–5 రోజుల్లో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్, యూనియన్ అ«ధ్యక్ష, కార్యదర్శులు సి రామకృష్ణ, టీడీ ప్రసాద్ పాల్గొన్నారు.