ముద్రగడకు వ్యతిరేకంగా సమావేశం!
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ కాపు నేతల సమావేశం పేలవంగా ముగిసింది. హ్యాపీ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జనంలేక సభ వెలవెలోయింది. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. వేదిక వేసిన కుర్చీలు కూడా నిండకపోవడం గమనార్హం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.
కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ముద్రగడ అరెస్ట్, తదనాంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ కాపు నేతలు ఈ భేటీ జరిపారు. మంగళగిరిలో సమావేశం నిర్వహించినప్పటికీ గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేతలెవరూ హాజరుకాలేదు.