మోడల్ హత్య: మరో నిందితుడి లొంగుబాటు
పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందిల్ బలోచ్ హత్యకేసులో సహ నిందితుడు, ఆమె మరో సోదరుడు హక్ నవాజ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్యలో అతడి హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు పంజాబ్ రాష్ట్రంలోని డేరా ఘాజీఖాన్ వద్ద పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో ఇంతకుముందు బలోచ్ సొంత సోదరుడు మహ్మద్ వసీమ్‌ను పోలీసులు శనివారమే అరెస్టు చేశారు. తాజాగా నవాజ్ కూడా లొంగిపోయాడు. తాను ముందుగా డ్రగ్స్ తీసుకుని, ఆ తర్వాత పీకనొక్కి తన సోదరిని చంపినట్లు వసీమ్ ఇంతకుముందే చెప్పాడు. ఇందులో నవాజ్ పాత్ర ఎంతో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాహోర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వసీమ్‌కు డీఎన్ఏ, పాలీగ్రాఫ్ పరీక్షలు చేయించారు.
ముల్తాన్ నగరంలోని తమ ఇంట్లో బలోచ్‌ను ఈనెల 15వ తేదీన వసీమ్ హతమార్చాడు. బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. తాను మాదక ద్రవ్యాలకు బానిసయినా, స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు.